2024 టార్గెట్ గానే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందు కోసం ఇప్పటి నుంచే తీవ్ర కసరత్తు ప్రారంభించాయి కూడా. దేశ రాజకీయాల్లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జరగనున్న 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటి... మోదీ సర్కార్ కు గట్టి షాక్ ఇవ్వాలని బలంగా నిశ్చయించుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇందుకోసం పార్టీ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు కూడా.

ఓ రకంగా చూస్తే వచ్చే ఏడాదిని ఎలక్షన్ ఇయర్ గా అభివర్ణించవచ్చు. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో జమ్ము కశ్మీర్ కు కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఆ దిశగా కసరత్తు ప్రారంభించాయి కూడా. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి కూడా అక్టోబర్, డిసెంబర్ లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది ఇప్పటి నుంచే.

ముందుగా అతి పెద్ద రాష్ట్రం యూపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేతలు... ఆ రాష్ట్రంలో ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇక పంజాబ్ లో తాజాగా పార్టీ నేతల మధ్య తలెత్తిన వివాదాన్ని కూడా సామరస్యంగానే పరిష్కరించగలిగింది. కేంద్రంపై ఇప్పటికే పలు అంశాల్లో ఎదురుదాడి చేస్తున్న రాహుల్ టీమ్... ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఎన్నికల నాటికి ప్రతి ఒక్కరి మద్దతు కూడగట్టేలా రాహుల్ గాంధీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్సీపీతో కాంగ్రెస్ జత కట్టింది. ఇక సోనియా, మమతా బెనర్జీ మధ్య జరిగిన చర్చలు ప్రస్తుతం హస్తినలో హాట్ టాపిక్ గా మారాయి. కేంద్రంలో బీజేపీ నాయకత్వాన్ని దెబ్బ తీయాలంటే... ముందుగా రాష్ట్రాల్లో పాగా వేయాలనేది కాంగ్రెస్ గేమ్ ప్లాన్ లా కనిపిస్తోంది. ఇప్పటికే పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ ను కుదిపేస్తున్న నేపథ్యంలో... ఇప్పుడు తాజాగా పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై చినబాబు తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. సైకిల్ పై పార్లమెంట్ ఆవరణకు వచ్చిన రాహుల్ గాంధీ... మోదీకో హాటావో... దేశ్ కో బచావో అంటూ నినాదాలు చేశారు. ఏది ఏమైనా... కాంగ్రెస్ ఎలక్షన్ టార్గెట్ కల నెరవేరుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: