వీరంటే ఎందుకంత ప్రేమ ?
భారత దేశంలో  చాలా కాలంగా ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది.  ప్రభుత్వ రంగంలో యథేశ్చగా జరుగుతున్న ఈ పోకడలను ఎవరూ ప్రశ్నించటం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏమవుతుందో తెలిసిన విషయమే. రాజ్యధిక్కారమవుతుంది.  పాలకుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. పాలనా పగ్గాలు చేతికి వచ్చాయి కదా అంటూ  ప్రభుత్వాధినేతలు   ఇష్టారీతిన వ్యవహరిస్తుండటం మనుం చూస్తున్నాం.

వివిధ రాష్ట్రాలు పదవీ విరమణ చేసిన ఐ.ఏ.ఎస్ అధికారులసేవలు వినియోగించుకునేందుకు మక్కువ చూపుతున్నాయి.  అది కూడా ఉన్నత స్థాయిలో రిటైర్ అయిన  అధికారులను సలహాదారులుగా,, వివిధ కార్పోరేషన్ లకు అధ్యక్షులుగా నియమించుకుంటున్నాయి.  ప్రభుత్వాధినేతలు ఐ.ఏ.ఎస్ అధికారులపై పట్టు సాధించేందుకు , ఉన్న పట్టును నిలబెట్టుకునేందుకు  ఈ రిటైర్డ్  అధికారులసేవలపై మక్కువ చూపుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.  పలు రాష్ట్రాలు  ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి హోదాలో పని చేసిన వారు, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన  సీనియర్ ఐ.ఏ.ఎస్ లను సలహాదారులుగా నియమించుకుంటున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు  చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పని చేసి రిటైర్  అయిన  బ్యూరోక్రాట్ లను తిరిగి మరలా దొడ్డిదారిన   స్వరాష్ట్రంలోనే నియమించుకుంటున్నాయి.


 ఈ పోకడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  మదిలోని ఆలోచనగా రాజకీయ పరిశీలకులు పేర్కోంటున్నారు. ఆయన స్వంత రాష్ట్రంలోనే  ఈ ప్రక్రియ ఆరంభమైనట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉన్న ప్పుడు కైలాష్ నాథ్ అనే ఐ.ఎ.ఎస్ అధికారి చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (సిపిఎస్ఎస్) హోదాలో పనిచేశారు. 1979 బ్యాచ్ కు చెందిన ఈయన  2013లో ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ తరువాత ఈ అధికారి కోసం ముఖ్యమంత్రి  పేషీలో క్యాబినెట్ మంత్రి  హోదాతో  ఓ పదవిని కేటాయించారు. క్యాబినెట్ మంత్రి  హోదా కావడంలో  రాష్ట్రంలోని అందరు అధికారులూ ఈయనగా రికి సలాం కొట్టాల్సిందే. కైలాష్ నాథ్ ముఖ్యమంత్రి పేషీ లోనికి 2006 కార్యదర్శి  హోదా లో వచ్చారు. 2013లో ఉద్యగ కాలం పూర్తయినా , ఆయన సేవలను  ఆ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది.  ఎంత మేర అంటే....దాదాపు 15 సంవత్సరాలకు పైచిలుకు కాలం ఆయన ముఖ్యమంత్రి పేషీని అంటిపెట్టుకుని కూర్చున్నారు.  ఏడు మార్లు ఆయన పదవీ కాలం పొడిగించ బడింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ హయాం నుంచి నేటి ముఖ్యమంత్రి భుపేంద్ర పటేల్ వరకూ ఆయన హవా సాగుతోంది.

ఇక పంజాబ్ రాష్ట్రంలో సురేష్ కుమార్ అనే ఐ.ఎ.ఎస్ అధికారి  2016లో పదవీ విరమణ చేశారు. 1983 బ్యాచ్ కు చెందిన ఈయన  సేవలు అత్యంత అవసరమని  కెప్టెన్ అమరీందర్ సింగ్ బావించారు. 2017 లో ముఖ్యంత్రి పేషీలో స్థానం కల్పించారు. ఎటువంటి హోదా కట్టబెట్టారంటే ఈయన గారికి ఏకంగా కేంద కేబినెట్ హోదా కట్టబెట్టారు. రాచమర్యాదలకు వేరే చెప్పాలా ? సురేష్ కుమార్ నియామకం చట్టవిరుద్దమని పంజాబ్ హై కోర్టులో కేసు దాఖలైంది. కోర్టులో సురేష్ కుమార్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అమరీందర్ సింగ్ నేతృత్వం లోని పంజాబ్ ప్రభుత్వం  కోర్టు తీర్పు పై డివిజన్ బెంచ్ కు అప్పీలుకు వెళ్లింది. అక్కడ ప్రభుత్వానికి స్టే లభించింది. దీనిని ఆసరా గా చేసుకుని సురేష్ కుమార్ తన పదవిలో కొన సాగుతున్నారు. పంజాబ్ హర్యానా హై కోర్టు ఈ ఆగస్టులో ఇరు పక్షాల వాదనలు వి నడం పూర్తి చేసింది. తీర్పును  రిజర్వులో ఉంచింది. తాజాగా  అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం జరిగింది.  అయన స్థానంలో చరణ్ సింగ్ చెన్నీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు.


హర్యానా రాష్ట్రంలో కూడా పంజాబ్ బాటలోనే నడుస్తోంంది. 1982 బ్యాచ్ కు చెందిన ఐ.ఏ.ఎస్ అధికారి  దీపేందర్ సింగ్ దేశీ ప్రధాన కార్యదర్శి  హోదాలో పని చేసి 2019 లో ఉద్యోగ విరమణ చేశారు.  2020లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కు సిపిఎస్ గా చేరారు.
 
తెలుగురాష్ట్రాల నేతలు కూడా మాజీ ఐఏఎస్ ల సేవలను తాజాగా ఉపయోగించుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిగా పనిచేసిన రమణాచారి  ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా  వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లోనూ ఇవి మామూలే. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ వేరు పడ్డాక తొలి ముఖ్యమంత్రి గా  బాధ్యతలు స్వీకరించి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా  ఉద్యోగ విరమణ చేసిన  కృష్ణారావు వెంటనే బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ గా నియమించింది. ఆయన తరువాత  ముఖ్యమంత్రిగా  పదవిని అధిష్టించిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు బాటలోనే నడిచారు. మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి అజయ్ కల్లం ను సలహాదారుగా నియమించుకున్నారు.  ఆ తరువాత ఉద్యగ విరమణ చేసిన  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ని  రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించారు. అంతే కాదు ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బెర్త రిజర్వు చేసింది. ఆయన ఈ పదవి నుంచి రిలీవ్ అయిన వెంటనే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  ప్రతినిధిగా ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో సేవలందించనున్నారు. ఈయనకు కూడా కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: