ఏపీ సీఎం జగన్‌ను ఏమని పిలుస్తారు.. జగన్మోహన్‌ రెడ్డి అని.. లేదా.. జగన్‌ అని అంటారు.. వైసీపీ కార్యకర్తలు ప్రేమతో జగనన్నా.. అని పిలుచుకోవచ్చు.. పోనీ.. వైసీపీ కార్యకర్తలే ఎందుకు ప్రజలంతా కూడా జగన్‌ను జగనన్నా.. అని పిలుచుకుంటారంటారా... సరే అలాగే కానివ్వండి.. ప్రేమతో పిలిస్తే ఎవరు మాత్రం కాదంటారు..అయినా ప్రజలతో అన్నా అనిపిలిపించుకోవాలని నాయకుడు అనుకోవడం కూడా తప్పు కాదుగా.. అలా పిలిపించుకోవడం వరకూ పర్వా లేదు.


కానీ.. జగన్ ఏపీ సీఎం అయ్యాక ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. అదేటంటే.. ప్రభుత్వ పథకాలకు తన సొంత పేరు పెట్టుకోవడం.. ప్రభుత్వ పథకాలకు నేతల పేర్లు పెట్టడం కొత్తేమీ కాదు.. ఇది మన దేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయమే.. కాంగ్రెస్‌ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపథకానికి ఇందిర, రాజీవ్‌, నెహ్రూ పేర్లు పెట్టేవారు. ఈ విషయంలో ఇప్పటి సీఎం జగన్ తండ్రి వైఎస్సార్ రికార్డు నెలకొల్పారు.. అప్పట్లో కనీసం ఓ 50 పథకాల వరకూ ఇందిర, రాజీవ్‌ పేర్లతో ఉండేవి.


ఆ తర్వాత చంద్రబాబు కూడా జగన్ బాటలోనే తన హయాంలో పథకాలకు తమ నాయకుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి తన పేరే పెట్టుకోవడం ప్రారంభించారు. చంద్రన్న కానుక అంటూ చంద్రన్న అనే పదాన్ని పాపులర్ చేద్దామని ప్రయత్నించారు. అంత అంతగా సక్సస్ కాలేదనుకోండి. ఆ తర్వాత జగన్ ఇప్పుడు ఏకంగా ప్రతి పథకానికీ తన పేరే పెట్టేసుకుంటున్నారు. మొదట్లో మోహమాటం కోసం ఒకటి, రెండు పథకాలకు తండ్రి పేరు పెట్టారు.


వైఎస్‌ ఆర్‌ పేరు ఇక చాలనుకున్నారో ఏమో.. జగన్ ఇప్పుడు స్వయంగా తన పేరే పథకాలకు పెట్టుకుంటున్నారు. జగనన్న విద్యాకానుక.. జగనన్న భూరక్ష.. జగనన్న.. ఇలా అన్నింటికీ జగనన్న పేరు పెట్టేస్తున్నారు. చివరకు పిల్లలకు ఇచ్చే స్కూల్ బ్యాగుల మీద.. ఆఖరుకి బెల్టుల మీద కూడా జగనన్న పేరు వేయిస్తున్నారు. నాయకుడు జనం గుండెల్లో ఉండాలి.. ఇలా పథకాల పేరిట లబ్దిదారుల వస్తువుల మీద కాదేమో.. జగనన్నా..!

మరింత సమాచారం తెలుసుకోండి: