రాజకీయ నాయకులు అన్నాక అరెస్టు కావడం చాలా కామన్.. అనేక విషయాలపై రాజకీయ నాయకులు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటారు. ఆయా సమయాల్లో అరెస్టులు అవుతుంటారు. ఆ తర్వాత కొద్దిసేపటికి వారిని విడిచిపెడుతుంటారు. అయితే.. కొన్ని అరెస్టులు మాత్రం ఆసక్తిరేపుతాయి. గతంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు ఇలాగే సంచలనంగా మారింది. వైసీపీ అధినేతను విమర్శించిన కేసులో రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసిన పోలీసులు.. ఆ తర్వాత చిత్రహింసలు పెట్టారని  ఆయన వర్గీయులు చెబుతుంటారు.


ఈ విషయంలో రఘురామ కృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను కస్టడీ సమయంలో చాలా దారుణంగా కొట్టారని తెలిపారు. వళ్లు హూనమయ్యేలా కొట్టిన తర్వాత ఓ వ్యక్తి తన గుండెలపై కూర్చుని చంపే ప్రయత్నం చేశాడని కూడా చెప్పారు. ఆ తర్వాత తన కాళ్లుపై దారుణంగా కొట్టారంటూ తన గాయాలతో కూడిన కాళ్ల వీడియోలను ఫోటోలను మీడియాకు పంపారు. దీంతో రఘురామరెడ్డి అంశం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి జగన్‌ ను విమర్శిస్తే సీన్ మామూలుగా ఉండదన్న విషయం రఘురామ కృష్ణంరాజు అంశంతో తేలిపోయింది.


అందుకే ఇప్పుడు టీడీపీ నేత పట్టాభి ముందుగా జాగ్రత్త పడుతున్నారు. తనను అరెస్టు చేసే ముందు ఆయన తెలివిగా ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో తాను ఎంత ఆరోగ్యంగా ఉన్నదీ వివరించారు. అంతే కాదు.. తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. వీడియోలో షూట్ చేసి మరీ మీడియాకు వీడియో విడుదల చేశారు. రఘురామ కృష్ణంరాజు తరహాలో తనను కూడా ఇబ్బంది పెడతారేమో అని భావించిన పట్టాభి ముందస్తుగా ఈ వీడియో విడుదల చేశారు.


ప్రస్తుతం తన కాళ్లూ చేతులూ, శరీరం అన్నీ బాగానే ఉన్నాయంటున్న పట్టాభి.. ఆ తర్వాత పోలీసులు తనను కొడితే.. ఆ తేడా చూపించి పోలీసులను కంట్రోల్‌ చేయవచ్చన్నది పట్టాభి ఆలోచగా ఉంది. అయితే దెబ్బలు బయటకు కనిపించకుండా చిత్రహింసలు పెట్టడంలోనూ మన పోలీసులు నేర్పరులే. మరి పట్టాభి ముందు జాగ్రత్త ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: