ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కాక మీదున్నాయి. దాడులు, బూతులు, అరెస్టులు, ఆందోళనలు, నిరసనలు.. ఇలా రాష్ట్రం అట్టుడుకుతోంది. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలన్నీ పక్కకు పోయాయి. మొన్నటిదాకా రాష్ట్రాభివృద్ధికి, ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ సంక్షోభం వంటి అంశాలే చర్చనీయాంశంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య బూతుల అంశమే ప్రధానంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్‌.. బోసిడీకే అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని అన్నారో.. లేక సజ్జల రామకృష్ణారెడ్డిని అన్నారో.. అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు మాత్రం.. తమ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డినే దూషించారని వీరావేశంతో ఊగిపోయారు. ఫ్యాన్‌ పార్టీ ఫ్యాన్స్‌ అయితే రెచ్చిపోయి.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. విధ్వంసం సృష్టించారు. అలాగే ఆయా జిల్లాల్లోని ఆ పార్టీ కార్యాలయాల్లోనూ దాడి చేశారు. ఇక పట్టాభి ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. కారు, బైక్‌, ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ వరుస పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహించారు. ఇది తమపై దాడి కాదని, ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా అభివర్ణించారు. వైసీపీ దాడులకు నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఇక అధికార వైసీపీ కూడా అదే రోజున నిరసన ప్రదర్శనలు చేపట్టింది.

ఒకవైపు ప్రతిపక్ష టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌, మరోవైపు అధికార వైసీపీ నిరసన ప్రదర్శనలతో బుధవారం రోజున రాష్ట్రం రగిలిపోయింది. అదే రోజు రాత్రి అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పట్టాభి రామ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రం స్పందించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖలకు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ గురువారం రోజున 36 గంటలపాటు ధర్మ దీక్షకు ఉపక్రమించారు. ఇటు వైసీపీ కూడా జనాగ్రహ దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు, నేతలు చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిట్టకుండానే తిట్టినట్లుగా, బూతులు మాట్లాడుతూనే.. మాట్లాడినట్లుగా వ్యవహరించారు. సీఎం జగన్‌ సైతం విజయవాడలో జరిగిన అమరవీరుల దినోత్సవంలో బోసిడీకే అనే బూతుకు అర్థం ఏమిటో చెబుతూ.. "ముఖ్యమంత్రిని అలా అనడం కరెక్టేనా?" అని ప్రశ్నించారు. దీంతో గతంలో కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తోపాటు పలువురు మంత్రులు, నాయకుల నోటి నుంచి వెలువడిన దూషణలు, బూతులు వంటివి సామాన్యుల్లో చర్చకు దారితీశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కొందరు ప్రముఖులు తమదైన శైలిలో సెటైర్లు కూడా వేస్తున్నారు. ఈ కోవలో ముందుగా చెప్పుకోవాల్సింది వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ రాజకీయాలపై చేసిన సెటైరిక్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆయన చేసిన ట్వీట్‌ సారాంశం ఏమిటంటే- "ఏపీలో పొలిటికల్‌ లీడర్లు ఇక బాక్సింగ్‌, కరాటే, కర్రసాము వంటి వాటిలో ట్రైనింగ్‌ తీసుకోవాల్సిందే" అన్నట్లుగా కామెంట్‌ చేశారు. ఎప్పుడూ వివాదాలతో నిద్ర లేచే రామ్‌గోపాల్‌ వర్మ.. తాజాగా తనదైన శైలిలో చేసిన ట్వీట్‌ ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తంమీద రాష్ట్రంలో ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించడానికే అధికార వైసీపీ దాడులు, అరెస్టులకు పాల్పడుతోందని ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో అధికార వైసీపీ నేతలు.. "మమ్మల్ని మీరు ఒకటి అంటే.. మేము మిమ్మల్ని నాలుగు అంటాం" అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీంతో రాష్ట్రంలో అసలేం జరుగుతోంది? అనేది అర్థంకాక సామాన్య ప్రజానీకం అయోమయంలో ఉంది. ఈ గందరగోళం ఇంతటితో సమసిపోతుందా? లేక మున్ముందు మరింత రాద్దాంతానికి దారితీసి రాష్ట్రం రావణకాష్టంలా మారుతుందా? అనే భయాందోళన రాష్ట్ర ప్రజానీకంలో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: