ఇరోజు ధరల పెరుగుదల అనే విషయం ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో మాత్రమే పరిమితమైనది కాదు కదా. కోటీశ్వరుల నుండి మొదలు కొంటే వీధులలో అడుక్కుతినే అభాగ్యుల వరకు కూడా అధిక ధరల ప్రభావానికి గురవుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ నిత్యావసరాలతో పాటు ఇతరత్రా పెట్రోల్, డీజిల్ వంటగ్యాస్ వంటి ప్రధానమైనటువంటి  వస్తువులు  పేద వర్గాలoపై వెంటనే ప్రభావం చూపుతాయి. ఉన్నత వర్గాల వారు ఏదోరకంగా ధరల పెరుగుదల లో, ప్రభుత్వ నిర్మాణంలో ,ప్రభుత్వ భాగస్వామ్యంలో లబ్ధి పొందిన వారే అయి ఉంటారు. కనుక వారి నుండి ఎక్కువగా వ్యతిరేకత రాదు. వారికి ఆ అవసరం కూడా లేదు.
   
ధరల పెరుగుదల- కుటుంబాల ఆదాయం:
 
 ముఖ్యంగా ధరలు పెరుగుతున్నాయి అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే అదే స్థాయిలో ప్రజల లేదా విభిన్న వర్గాల యొక్క ఆదాయాలు పెరిగనప్పుడు ప్రతినోటా ధరలు పెరుగుతున్నాయి అనే మాట వస్తుంది. ఇదే సూత్రం ఆధారంగా చేసుకుని ధరల పెరుగుదలను బట్టి ప్రైవేటు ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకు కరువు భత్యం, వేతన పెంపుదల వంటి సౌకర్యాలను కల్పిస్తూ ఉంటారు. ధరలు పెరుగుతున్నాయి కనుక వేతనాలు పెంచమని డిమాండ్ చేయడం ఒక అంశం అయితే వేతనాలను పెంచటం ద్వారా ఉద్యోగి వర్గంలో ఉన్న వారికి మాత్రమే ప్రయోజనం జరుగుతుంది. అంతే స్థాయిలో ఆదాయాలు పెరిగనటువంటి అట్టడుగు పేద మధ్యతరగతి వర్గాలకు నిత్యావసరాలు ఇతరత్రా వస్తువుల ధరల పెరుగుదల గుదిబండగా మారి తమ కొనుగోలు శక్తి తగ్గి పేదలు మరి పేద వాళ్ళుగా తయారు అవుతారు. ఈ రకమైనటువంటి వైవిధ్యాన్ని పేదలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని సమాజం యావత్తూ ఆలోచించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.


ఎందుకంటే ఇవాళ మనం, ఉన్నత మధ్య తరగతి వర్గాలు గా ఉన్న ప్రజలు తాము అనుభవిస్తున్న టువంటి అనేక సౌకర్యాలకు ,విలాసాలకు ప్రధాన కారణం కార్మిక కర్షకులు, చేతి వృత్తులు, వివిధ రకాలుగా పనిచేస్తున్న దినసరి కూలీలు, సంచార జాతులు వలస కూలీలు అని చెప్పక తప్పదు.  అందుకే రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనే ఉపాధ్యాయ సంఘం ముఖ్యంగా ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ సామాజిక చింతన తో కూడుకున్న సంస్థ కనుక "జీతాలు పెంచడం కాదు ధరలు తగ్గించాలని ప్రధానంగా ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇది వినడానికి చాలా చిన్న విషయం లాగా అనిపించినా ఇందులో ఎంతో హేతుబద్ధత ఉన్నది. సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు అక్రమంగా పెంచుతున్న ధరలకు కళ్లెం వేయడానికి ఆనాడు ఉపాధ్యాయ సంఘం చేసిన డిమాండ్ ప్రభుత్వాలను ఆలోచింప చేసినది. కానీ అమలు సాధ్యం కాలేదు. అమలు కానంత మాత్రాన ఆ డిమాండ్ పాతబడింది అనడానికి వీలు లేదు. నిరంతరం బుద్ధి జీవులు మేధావులు ప్రజా సంఘాల నోళ్లలో నానుతూ ఉంటే ప్రభుత్వాలు ఆలోచిస్తా యి .పరిష్కారాలను వెతుకుతాయి. అయితే ధరలు తగ్గించడ మా? లేకుంటే ఆ వర్గాల యొక్క కొనుగోలు శక్తిని పెంచడమా..? అనేది ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: