హుజూరాబాద్ ఉపఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా నిలిచింది. ఏకంగా ఓటుకు పది వేల రూపాయల వరకూ ఆఫర్‌ చేశారంటే.. బహుశా అంత ఎక్కువ ఏ ఎన్నికల్లోనూ ఖర్చు పెట్టి ఉండరు. ఈ ఎన్నిక తెలంగాణ సీఎం కేసీఆర్‌కూ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కూ ప్రెస్టీజ్‌ ఇష్యూ కావడంతో ఖర్చుకు ఇరు వర్గాలు ఏమాత్రం వెనుకాడలేదు. కేవలం ఎన్నికల ముందే కాదు.. అసలు ఈటల రాజీనామా చేసిన వెంటనే హుజూరాబాద్‌లో కనక వర్షం మొదలైంది.


అయితే.. అధికార పార్టీ ఈ హుజూరాబాద్ ఎన్నిక కోసం ఏకంగా రూ. 200 కోట్ల వరకూ ఖర్చు చేసిందని కొన్ని పత్రికలు విశ్లేషణలు రాస్తున్నాయి. అయితే ఈటల కూడా ఏమాత్రం తగ్గకుండా దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఈ ఎన్నిక కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తోందట. హుజూరాబాద్ ఎన్నికల బరిలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కొక్క ఓటరుకూ ఆరు వేల వంతున పంచినట్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చారు. ఇక భారతీయ జనతా పార్టీ పదిహేను వందల వంతున పంచిపెడుతున్నాయని మీడియా ఘోషించిందని ఆర్కే చెబుతున్నారు.


తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా హుజూరాబాద్‌లో డబ్బు పంపిణీ చేశారని ఆంధ్రజ్యోతి ఆర్కే కూడా అభిప్రాయపడ్డారు. ఒక్కో ఓటరుకూ ఆరు వేల నుంచి పది వేల రూపాయల వరకు పంచడం రాజకీయ పార్టీల బరితెగింపే అంటున్నారు. హుజూరాబాద్‌లో శనివారం పోలింగ్‌ జరిగినప్పటికీ గత ఐదు నెలలుగా టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తూనే ఉన్నాయి.  బీజేపీ తరఫున ఈటల రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ తరఫున మంత్రి హరీశ్‌రావు జోరుగా ప్రచారం చేశారు.


ఆర్కే అంచనాల ప్రకారం టీఆర్‌ఎస్‌ తరఫున లక్షన్నర మందికి ఆరు వేల రూపాయల వంతున పంచారట. అయితే ఆ మొత్తం సజావుగా ఓటర్లకు చేరలేదట. కింది స్థాయి నాయకులు కొంత మొత్తాన్ని నొక్కేసారట. కానీ.. ఈటల రాజేందర్‌ తక్కువ మొత్తం ఇచ్చినప్పటికీ అందరికీ సజావుగా అందేలా మేనేజ్‌ చేశారట. అందుకేనేమో గెలుపుపై ఈటల రాజేందర్ కాస్త దీమాగా కనిపిస్తున్నారు. మొత్తానికి ఈటల పోల్ మేనేజ్‌మెంట్ బాగా చేశారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: