హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ ఆనందంలో మునిగిపోయింది. విజేతగా నిలిచిన ఈటల రాజేందర్‌ సంబరాలు చేసుకున్నారు. హుజూరాబాద్‌, కరీంనగర్‌లో విజయోత్సవాలు చేసుకుని మొన్న శామీర్‌పేటలోని తన నివాసానికి చేరుకున్నారు. నిన్న  శామీర్‌పేట నుంచి హైదరాబాద్ గన్ పార్క్ వరకూ కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో విజయ గర్జన చేశారు. ఓకే.. ఇదంతా విజేత ఆనందం.


కానీ ఈ సందడిలో ఓ విషయం గమనించారా.. హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముందు.. దాన్ని చాలా చిన్న విషయంగా మాట్లాడిన టీఆర్ఎస్ పెద్దలంతా ఆ తర్వాత బయటకు రావడం లేదు. ప్రత్యేకించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఉపఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత ఇంత వరకూ మీడియా ముందుకు రాలేదు.  ఇలాంటి చేదు ఫలితాలు వచ్చిన సమయాల్లో కొన్నాళ్లు కేసీఆర్ బయటకు రారు.. ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనరు. అసలు ఆయన ఉనికే కనిపించదు. ఈసారి కూడా అదే జరిగింది.


హుజూరాబాద్ ఉపఎన్నికల ముందు.. నవంబర్ 2 న ఫలితాలు వస్తాయని.. నవంబర్ 4న తానే స్వయంగా హుజూరాబాద్ వెళ్లి దళిత బంధు పంపిణీ చేస్తానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ ఫలితాలు వచ్చినా.. కేసీఆర్ మాత్రం ఇప్పుడు దళిత బంధు గురించి మాట్లాడటం లేదు. బహుశా కేసీఆర్ హుజూరాబాద్ ఫలితంపై అంతర్మథనం చేసుకుంటూ ఉండొచ్చు. మళ్లీ కొన్నిరోజుల తర్వాత కానీ.. ఆయన బయటకు రాకపోవచ్చు.. ఈ హుజూరాబాద్ ఫలితం హడావిడి.. దాని ప్రకంపనలు పూర్తిగా కనుమరుగయ్యే వరకూ వేచి ఉండొచ్చు.


అయినా.. దేన్నయినా అలవోకగా కొట్టిపారేయగల మాటల మరాఠీ కేసీఆర్.. కొన్నాళ్ల తర్వాత ఆయన బయటికొచ్చినా హుజూరాబాద్‌ పై వ్యాఖ్యానాలు చేయకపోవచ్చు. అబ్బే.. అదేమంత పెద్ద విషయం అంటూ తేలిగ్గా తీసిపారేయొచ్చు.. దేనికైనా సమర్థుడు కేసీఆర్‌. కానీ.. హుజూరాబాద్‌ ఫలితంపై ఆయన వ్యాఖ్యానం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: