తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఆలోచనాధోరణి మారుతోంది. తన కాలం నాటి రాజకీయంతో వైసీపీ అధినేత జగన్‌ను ఎదుర్కోవడం కష్టమని ఆయన ఓ అంచనాకు వచ్చారు. అందుకే కొత్త తరం రాజకీయ నాయకత్వం కావాలని ఆయన భావిస్తున్నారు. పార్టీకి కొత్త రక్తం ఎక్కించకపోతే జగన్‌తో ఢీ కొట్టడం కష్టం అని ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో ఇటీవల తరచూ చెబుతున్నారు. ఇకపై  పనిచేయని నాయకులు ఏస్థాయి వారైనా మార్చడం ఖాయమని చంద్రబాబు తన నాయకులకు  తేల్చి చెప్పారు.


చంద్రబాబు ఇటీవల తరచూ అనేక జిల్లాలకు చెందిన జిల్లా నాయకత్వంతో మాట్లాడుతున్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాస్త బాగా పని తీరు కనపరిచిన నాయకులను పిలిపించుకుని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాల్టీ ఫలితాలపై చంద్రబాబు సమీక్ష జరిపారు. గెలిచే స్థాయిలో ఉన్నప్పటికీ ఆకివీడు, కుప్పం మున్సిపాలిటీలను పోగొట్టుకున్నామని చంద్రబాబు అన్నారని తెలిసింది.


జగన్ వంటి ప్రత్యర్థి దుర్మార్గాల్ని ఎదుర్కొనే కొత్త నాయకత్వం లేకపోవడం వల్లే ఓడిపోయాని చంద్రబాబు అన్నారట. అందుకే  క్షేత్రస్థాయిలో ఉంటూ పోరాడి ఓట్లు సాధించే వారికే ఇకపై తెలుగు దేశంలో పెద్ద పీట వేస్తామని చంద్రబాబు చెబుతున్నారట. పార్టీ ఏ స్ట్రేటజీతో ఎన్నికలకు వెళ్లాలనే దానిపై పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారట. సీఎం జగన్‌ రెడ్డిపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉందని అంచనాకు వచ్చిన చంద్రబాబు దాన్ని తెలుగు దేశం సరిగ్గా వాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు.


తెలుగు దేశం నేతలు సరిగ్గా దృష్టి పెడితే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతున్నారు. పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం ఓట్ల శాతం పెరిగాయని.. ఇది మంచి పరిణామం అని.. ఇకపై తెలుగు దేశం ఈ పెరుగుదల కాపాడుకోవాలని చంద్రబాబు అంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: