ప్ర‌స్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాలను ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాలు రాజ‌కీయ ప్ర‌యోగశాల‌లుగా మార్చేసిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. త‌మ‌కు ఏమంత బ‌లంలేని రాష్ట్రాల్లో సైతం ఏదోఒక విధంగా పాగా వేసేందుకు రాజ‌కీయ పార్టీలు శ‌క్తివంచ‌న లేకుండా త‌మ‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. బీజేపీ ఈ రాజ‌కీయ క్రీడ‌ను చాలాకాలం క్రిత‌మే మొద‌లుపెట్టింద‌ని చెప్పాలి. అంతేకాదు..చాలా రాష్ట్రాల్లో త‌న మైండ్‌గేమ్ తో కూడిన‌ వ్యూహాల‌ను అమ‌లు చేస్తూ అంద‌రికంటే ముందుంది కూడా. ద‌క్షిణాదిలో బీజేపీ ఇప్పుడు ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌పైనా దృష్టి సారించిన విష‌యం తెలిసిందే. సామాజిక వ‌ర్గాల వారీగా బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేసుకుని ఏపీలొ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వం లోని జ‌న‌సేన పార్టీతో క‌లిసి న‌డుస్తోంది. అయితే ఆ పార్టీ ఇప్ప‌టిదాకా ఇక్క‌డ సాధించింది సున్నా. దీనికి కార‌ణం ఏపీపై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం విభ‌జ‌న హామీల‌తో స‌హా ప‌లు అంశాల్లో క‌క్ష గ‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌ట‌మే. స‌హ‌జంగానే బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త మిత్ర‌ప‌క్షంగా  ఉన్న జ‌న‌సేన‌పైనా ప‌డ‌టంతో ఆ పార్టీ కూడా న‌ష్ట‌పోతుంద‌నే చెప్పాలి.

నిజానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఏపీలో ఎంత బ‌లముందో తెలంగాణ‌లోనూ అంతే బ‌ల‌ముంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌ను ఆ రాష్ట్రంలోనూ పూర్తిస్థాయిలో ఉప‌యోగించుకుని ఉంటే, బీజేపీకి తెలంగాణ‌లో ఉన్న బ‌లానికి తోడు స్టార్ హీరోగా ప‌వ‌న్ కి ఉన్న ఆద‌ర‌ణ క‌లిసి ఉంటే అక్క‌డ బీజేపీ మ‌రింత మెరుగైన ఫ‌లితాలు సాధించ‌గ‌లిగి ఉండేది. కానీ విచిత్ర‌మేమిటంటే బీజేపీ మొద‌టినుంచీ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్ద పాత్ర లేద‌న్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. ఏపీకి కాబోయే సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటూ జ‌న‌సైనికుల‌ను జోకొడుతోంది. త‌ద్వారా ఆయ‌న‌ను ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం చేయాల‌నుకుంటున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ విభ‌జించి పాలించే రాజ‌కీయాల‌ వెనుక వ్యూహం ఏంటో ఆ పార్టీకి మాత్ర‌మే తెలియాలి.

 
ఇక ఏపీలో బీజేపీతో క‌లిసి వెళితే భ‌విష్య‌త్తులో త‌మ ప‌రిస్థితేమిటో అర్థ‌మైన జ‌న‌సేన నాయ‌కులు గ‌త స్థానిక ఎన్నిక‌ల్లో క్షేత్ర‌స్థాయిలో కొన్నిప్రాంతాల్లో లోపాయికారీగా టీడీపీతో పొత్తు పెట్టుకుని మంచి ఫ‌లితాల‌నే సాధించారు. అయినా ఇప్ప‌టికిప్పుడు బీజేపీని వ‌దిలి వేరుబాట ప‌ట్టేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్దంగా లేరు. బ‌లంగా ఉన్న వైసీపీని ఢీకొట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ అవ‌స‌ర‌మ‌నే ఆయ‌న ఇప్ప‌టికీ న‌మ్ముతున్నారు. అలాగ‌ని ప్ర‌చారార్భాట‌మే త‌ప్ప‌ బీజేపీ ప‌ట్ల‌ ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డే ఎలాంటి వ‌రాలనూ కేంద్రం ప్ర‌క‌టించ‌డం లేదు. మ‌రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ను ఆ పార్టీ ఎలా సీఎం పీఠంపై కూర్చోబెట్ట‌గ‌ల‌ద‌న్న‌ది ఆ దేవుడికే ఎరుక‌. క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: