మెగాస్టార్ చిరంజీవి ఇవాళ సీఎం జగన్‌తో భేటీ కాబోతున్నారు. ఏపీలో కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారిన టికెట్ల రేట్ల వ్యవహారంపై చిరంజీవి సీఎం జగన్‌తో చర్చించనున్నారు. కొన్నిరోజుగా ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో సినిమా ధరలను క్రమబద్దీకరిస్తూ కొన్ని రోజుల క్రితం ఏపీ సర్కారు ఓ జీవో తీసుకొచ్చింది. దీని ప్రకారం.. బెనిఫిట్‌ షోలు ఉండవు. అలాగే ప్రత్యేకంగా కొన్ని సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకోవడం కూడా నిషిద్ధం.  ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే టికెట్లు అమ్మాయి.


దీనికితోడు ఈ టికెట్ల ధర నిర్ణయం ప్రాంతాలను బట్టి ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో ఓ రేటు, గ్రామీణ ప్రాంతాల్లో ఓ రేటు..మల్టీ ప్లెక్సుల్లో మరో రేటు ఉంది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం సినిమా టికెట్‌ రేటు కొన్ని ధియేటర్లలో రూ. 5, రూ.10 కూడా ఉన్నాయి. దీంతో ఇంత తక్కువ ధరలతో థియేటర్లు నడపలేమని సినీ పరిశ్రమ వారు వాపోతున్నారు. చిన్న సినిమాలకు ఈ రేట్ల కాస్త ఓకే అయినా పెద్ద సినిమాలకు ఈ రేట్లు ఏమాత్రం గిట్టుబాటు కావని తేల్చిచెప్పేస్తున్నారు.


ఇలాంటి నేపథ్యంలో ఇవాళ చిరంజీవి జగన్‌తో భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఈ టికెట్ల రేట్ల అంశంపై దర్శకుడు, నిర్మాత రాంగోపాల్ వర్మ ఇటీవల మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఆయన తన వాదన వినిపించారు. అంత కాదు.. మంత్రితో భేటీ తర్వాత కూడా సోషల్ మీడియాలో ప్రశ్నలు వదులుతూ టికెట్ల అంశంపై పోరాటం చేస్తున్నారు. మరి ఇప్పుడు చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ అవుతున్న దృష్ట్యా ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.


ఇటీవలే తాను సినిమా ఇండస్ట్రీకి పెద్దను కాదని.. తాను పెద్దరికం వహించనని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.  అయితే.. పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రం తాను తప్పకుండా తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో టికెట్ల రేట్ల వ్యవహారం చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో చిరంజీవి జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ భేటీ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: