ఏపీలో యథావిధిగా పాఠశాలలు ఇవాల్టి నుంచి తెరుచుకుంటున్నాయి. మరోవైపు దేశంలోని అనేక రాష్ట్రాలు మాత్రం కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా భౌతిక తరగతులను ఆపేశాయి. ఆన్‌లైన్‌లోనే పాఠశాలలు నిర్వహించుకునేందుకు మొగ్గు చూపాయి. ఏపీ పక్కనే ఉన్న తెలంగాణ కూడా సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకూ పొడిగించింది. అయితే.. ఇప్పుడు సెలవులు కొనసాగించడం కరెక్టా.. పాఠశాలలు నిర్వహించడం కరెక్టా అన్న చర్చ మొదలైంది.


అయితే.. పాఠశాలలు కొనసాగిస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ బ్యాంకు పరోక్షంగా సమర్థించింది. అయితే.. ఇది నేరుగా జగన్ సర్కారును ఉద్దేశించి ప్రపంచ బ్యాంకు చెప్పకపోయినా.. కరోనా కారణంగా పాఠశాలల మూసివేతను ప్రపంచ బ్యాంకు తీవ్రంగా తప్పుబట్టింది. ఇలా కరోనా భయంతో పాఠశాలలను మూసి వేయడం ద్వారా ఆయా దేశాలు భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకుంటాయని వ్యాఖ్యానించింది.


అసలు కరోనా ప్రభావం పిల్లలపై చాలా తక్కువగా ఉందని.. కానీ.. పిల్లలకు ఏమైనా అవుతుందేమో అన్న భయంతో పాఠశాలలను మూసివేయడం ద్వారా భారీగా నష్టపోతాయని ప్రపంచ బ్యాంక్‌ విద్యా డైరెక్టర్ జైమే సావేద్రా వ్యాఖ్యానించారు. అంతే కాదు.. పిల్లలందరికీ వ్యాక్సీన్ వేశాకే పాఠశాలలు తెరవాలని కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయని.. ఈ ఆలోచన శాస్త్రీయం కాదని.. దీని వెనుక ఎలాంటి శాస్త్రీయత లేదని ప్రపంచ బ్యాంక్‌ విద్యా డైరెక్టర్ అన్నారు.


పాఠశాలల మూసివేత ద్వారా ఇండియాలో లెర్నింగ్‌ పావర్టీ 55 నుంచి 70 శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్‌ విద్యా డైరెక్టర్ అంచనా వేశారు. అసలు కరోనా సమయంలో పాఠశాలల మూసివేతకు అర్థమే లేదని ప్రపంచ బ్యాంక్‌ విద్యా డైరెక్టర్ కుండబద్దలు కొట్టేశారు. ప్రపంచ బ్యాంక్‌ విద్యా డైరెక్టర్ చెబుతున్న వాదనలు జగన్ సర్కారు తీరును పరోక్షంగా సమర్థిస్తున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలోనూ ఏపీ సర్కారు పాఠశాలల మూసివేతకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఒక విధంగా చూస్తే.. జగన్ విధానానికి ప్రపంచ బ్యాంక్‌ విద్యా డైరెక్టర్ వ్యాఖ్యల ద్వారా గట్టి సమర్థన లభించినట్టయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: