ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ పరిపాలనాకాలం సగం పూర్తయింది. ఆయన పాలనాకాలం మరో రెండున్నరేళ్లు ఉంది.. అంటే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లే ఉందన్నమాట. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల హడావిడి ఉంటుంది. సీఎంగా తన సత్తా చాటేందుకు ఇంకా జగన్‌కు అక్షరాలా ఏడాదిన్నరే మిగిలిందన్నమాట. మరి ఈ ఏడాదిన్నరలో జగన్ ఎంత వరకూ జనాలను మెప్పిస్తారన్నదే ఆయన మళ్లీ సీఎం కావాలా వద్దా అన్నది డిసైడ్‌ చేస్తుంది.


అయితే.. ప్రతిపక్ష టీడీపీకి మాత్రం వచ్చే ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా ఉంటాయి. కానీ ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏమంత బాగోలేదు. అయితే.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలనే చంద్రబాబు మెట్లుగా వాడుకుని విజయం దక్కించుకోవాల్సి ఉంటుంది. జగన్ పాలనలో రాజధాని విషయం అతి పెద్ద  వైఫల్యం అని టీడీపీ భావిస్తోంది. ఉన్న రాజధానిని ఎదగనీయకుండా.. అటు కొత్త రాజధానిగా విశాఖకూ ఓ గుర్తింపు తీసుకురాలేని జగన్ వైఫల్యాన్ని జనంలోకి బాగా ఫోకస్‌ చేయాలని టీడీపీ భావిస్తోంది.


ఇందుకు ఓ ప్రతిపాదనగా చంద్రబాబును అమరావతి ప్రాంతంలో ఎన్నికలబరిలో దింపాలన్న ఆలోచన కూడా జరుగుతోంది. చంద్రబాబు దశాబ్దాల తరబడి కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లోనూ కాస్త మెజారిటీ తగ్గినా గెలుపుకు ఢోకా లేకుండా పోయింది. అయితే మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ టీడీపీని ఘోరంగా ఓడించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఫలితం సాధిస్తామంటోంది.


కానీ ఈసారి చంద్రబాబును అమరావతి ప్రాంతం నుంచి బరిలో దింపితే.. చంద్రబాబు ఊపుతో ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు వస్తాయని.. అది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుందన్న వ్యూహాలపై టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. అమరావతి విషయంలో జగన్ వైఫల్యాన్ని ఎత్తి చూపాలంటే చంద్రబాబు అమరావతి ప్రాంతం నుంచే బరిలో దిగాలని కొందరు నేతలు సూచిస్తున్నారు. మరి అదే జరిగితే.. సీన్ మాత్రం చాలా రంజుగా ఉంటుంది.. దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: