వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదట్లోనే ఆధిపత్య పోరు మొదలైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే..అది నందికొట్కూరు మాత్రమే. ఎన్నికలై ఆరు నెలలు కాకముందే ఇక్కడ పోరు స్టార్ట్ అయింది. అప్పటినుంచి ఇప్పటివరకు నందికొట్కూరులో వైసీపీ నేతల మధ్య రచ్చ నడుస్తూనే ఉంది. ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిల మధ్య సఖ్యత ఏ మాత్రం లేదు. వరుసగా వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరికి తగ్గట్టుగానే వీళ్ళ వర్గాల మధ్య కూడా రచ్చ జరుగుతుంది.

గత రెండేళ్లుగా నందికొట్కూరులో ఇదే పరిస్తితి....ఆర్థర్, బైరెడ్డిలకు ఏ మాత్రం పొసగని పరిస్తితి. వైసీపీ అధిష్టానం చాలాసార్లు సర్దిచెప్పాలని చూసిన పెద్దగా ప్రయోజనం లేదు. ఎప్పటికప్పుడు పోరు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. బైరెడ్డి చేసే కార్యక్రమాల్లో ఆర్థర్ ఉండరు...ఆర్థర్ చేసే కార్యక్రమాల్లో బైరెడ్డి ఉండరు. ఇక జిల్లాకు ఎవరైనా మంత్రులు గాని, ఇంచార్జ్‌లు గాని వచ్చిన అదే పరిస్తితి. పైగా బ్యానర్లలో బొమ్మలు గురించి గొడవ.

అయితే వైసీపీ పెద్దలు సైతం బైరెడ్డికే సపోర్ట్‌గా ఉన్నారని ఆర్థర్ వర్గం రగిలిపోతుంది. ఇటీవల జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్‌ని సైతం నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వమని ఆర్థర్ వర్గం సవాల్ కూడా చేసింది. ఇలా ఇద్దరు నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆర్థర్‌కు సీటు రాకుండా బైరెడ్డి వర్గం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా ఆయనని సైడ్ చేయాలని చూస్తున్నారు.

ఆ మాట‌కు వ‌స్తే మండ‌ల‌, జ‌ట్పీటీసీ ప‌ద‌వులు, నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో కూడా బైరెడ్డి మాటే నెగ్గింది. ఆర్ధ‌ర్‌కు ఏదో మొఖ‌మాటం కొద్ది కొన్ని ప‌ద‌వులు ఇచ్చారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇదివరకే తాను ఇంకా పోటీ చేయనని ఆర్థర్ చెప్పేశారు. తనకు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని చెప్పి గతంలోనే ఆర్థర్ అలా మాట్లాడేశారు. అంటే ఈ ఆధిపత్య పోరు వల్ల తనకు పోటీ చేయడానికి ఇష్టం లేదని తెలుస్తోంది. కానీ ఆయన వర్గం మాత్రం పోటీకి దిగాల్సిందే అంటుంది.

బైరెడ్డి వర్గం మాత్రం ఎమ్మెల్యేనే మార్చేయాలని చూస్తుంది. మరి నందికొట్కూరు సీటు విషయంలో జ‌గ‌న్ కూడా బైరెడ్డికే ఓటు వేస్తార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో బైరెడ్డి చెప్పిన వాళ్ల‌కే సీటు ఇస్తార‌ని స్థానికంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఏదేమైనా బైరెడ్డి హ‌వా అయితే మామూలుగా లేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: