మరి కావాలని తీసుకొచ్చారా లేక నిజంగానే అభివృద్ది చేయాలని చేశారో తెలియదు గాని...సీఎం జగన్ హఠాత్తుగా జిల్లాల విభజనని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ జిల్లాలు విభజన ఇప్పటిలో అమలులోకి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే జన గణన అవ్వకుండా, విభజన చేయకూడదనే కేంద్రం ఆదేశాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు జగన్ ప్రభుత్వం ఎందుకు జిల్లాల విభజన తీసుకొచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. సడన్‌గా తీసుకొచ్చిన ఈ జిల్లాల గొడవతో ఊహించని ట్విస్ట్‌లు వస్తున్నాయి...13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా మార్చడంతో అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. ఒక జిల్లా అని కాదు...13 జిల్లాల్లోనూ ఇదే రచ్చ.

ఇక కృష్ణా జిల్లాలో కూడా ఈ జిల్లాల రగడ నడుస్తోంది. కృష్ణా జిల్లా మొత్తం మూడు జిల్లాలుగా విడిపోయింది. జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే మచిలీపట్నం పరిధిలో ఏడు, విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక కృష్ణాలో ఉండే నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు ఏలూరు పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళాయి. దీంతో ఆ రెండు ఇప్పుడు ఏలూరు కేంద్రంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. ఇక ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల జ‌నాల‌కు, ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లాతో ఉన్న అనుబంధం పూర్తిగా తెగిపోనుంది.

అయితే నూజివీడులోని ఆగిరిపల్లి మండలం విజయవాడకు చాలా దగ్గరగా ఉంటుంది. దీంతో వారు తమని విజయవాడలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు..పూర్తిగా విజయవాడ నగరానికి దగ్గర ఉండేవి. ఈ రెండు విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆనుకుని ఉంటాయి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు విజ‌య‌వాడ కూత‌వేటు దూరంలో ఉంటుంది. అలాంటిది ఎక్క‌డో 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాలో కలిపారు. ఆ రెండు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల జ‌నాలు త‌మ‌ను విజ‌య‌వాడ జిల్లాలోనే ఉంచాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాని ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ పుట్టింది పామర్రు నియోజకవర్గంలో అది మచిలీపట్నం పరిధిలో ఉంది. ఆయ‌న పుట్టిన నిమ్మ‌కూరు ఒక‌ప్పుడు గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు పామ‌ర్రులో ఉంది. మరి అలాంటప్పుడు మ‌చిలీప‌ట్నం కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు కాకుండా విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడంలో అర్ధం లేదని అంటున్నారు. మొత్తానికి జిల్లాల గొడవ కృష్ణా ప్రజల్లో చిచ్చు రేపింది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: