గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక టీడీపీని నిరాశపరిచింది. ఇక్కడ గెలవకపోయినా వైసీపీ రెబల్ అభ్యర్థి వైసీపీపై విమర్శలు చేస్తారని ఆశించినా అలాంటి పరిణామం ఏమీ చేటు చేసుకోలేదు. ఈ ఎన్నిక అయ్యే వరకూ మీడియాకు కనిపించని ఆమె.. ఎన్నిక పూర్తయ్యాక ఓ వీడియో విడుదల చేశారు. ఈ ఎంపిపి ఎన్నిక సందర్భంగా తన తల్లిని కిడ్నాప్ చేశారంటూ పద్మావతి కుమారుడు ఆరోపించటం కొంత కలకలం రేపింది. అయితే ఎంపిపి ఎన్నిక వ్యవహారం పూర్తయ్యాక ఆమె వీడియో విడుదలైంది.


అందులో ఆమె తనను ఎవరూ అపహరించలేదని పేర్కొన్నారు. తాను మిగతా వైసీపీ సభ్యులతో పాటు క్యాంపులో ఉన్నట్లు పద్మావతి చెప్పారు. దుగ్గిరాల ఎంపిపిగా పార్టీ నిర్ణయించిన సంతోష రూపవాణికి మద్దతిచ్చినట్లు పద్మావతి  వెల్లడించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పద్మావతి స్పష్టం చేశారు. తెనాలిలోని క్యాంపు నుంచే ఈ వీడియో విడుదలైనట్లు సమాచారం. ఎంపిపి ఎన్నిక పూర్తయిన తర్వాత ఆమె తీరికగా రాత్రికి ఇంటికి చేరుకున్నారు.


నిన్న ఉదయం నుంచి దుగ్గారాల ఎంపీపీ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. ఎంపీపీ ఎన్నికే అయినా దానికి ప్రత్యేకత ఉంది. దుగ్గిరాల ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. అయితే ఇక్కడ 18ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ నుంచి 9మంది, జనసేన నుంచి ఒక్కరు, వైసీపీ నుంచి 8మంది ఎంపీటీసీలు విజయం సాధించారు. టీడీపీ నుంచి గెలిచిన షేక్ జబీన్ కు బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని టీడీపీ ఆరోపించింది. వైసీపీ నుంచి ఇద్దరు బీసీ మహిళలు సంతోష రూపవాణి, తాడిబోయిన పద్మావతి  గెలిస్తే  సంతోష రూపవాణి ని ఎంపీపీ అభ్యర్థిగా వైసీపీ నిలబెట్టింది.


అయితే.. ఎంపీపీగా పోటీ చేయాలని తాడిబోయిన పద్మావతి కూడా భావించడంతో రాజకీయం మొదలైంది. స్వతంత్ర అభ్యర్థిగా పద్మావతి నిలబడితే మద్దతు ఇవ్వాలని టీడీపీ, జనసేన భావించాయి. కానీ పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే చివరి నిమిషంలో క్యాంపునకు తరలించి చక్రం తిప్పారు. టీడీపీ ఆశలను అడియాశలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: