రాజకీయ పార్టీ అంటే ఏం చేస్తుంది.. అధికారంలో ఉంటే.. హామీలిస్తుంది.. ప్రతిపక్షంలో ఉంటే విమర్శలు చేస్తుంది. అంతేగా.. అనుకుంటారు చాలా మంది. అంతే కాదు.. అని విభిన్నంగా స్పందిస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఏపీలో పార్టీ తరపున భారీగా జాబ్‌ మేళాలు నిర్వహిస్తూ రాజకీయ పార్టీకి కొత్త అర్థం చెబుతున్నారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలలో భారీ జాబ్‌ మేళాలు నిర్వహించిన విజయసాయి రెడ్డి.. ఇప్పుడు గుంటూరులోనూ భారీ జాబ్ మేళాకు సిద్ధమవుతున్నారు.


అవును.. ఏపీ నిరుద్యోగులకు ఇది శుభవార్తే.. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో ఇవాళ, రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యలు విజయసాయి రెడ్డి వెల్లడించారు. యువతకు అండగా నిలబడేందుకే జాబ్ మేళాలకు శ్రీకారం చుట్టినట్లు విజయసాయి రెడ్డి  తెలిపారు. రాష్ట్రంలో మూడు దశల్లో ఈ జాబ్ మేళాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలలో ఇప్పటికే పూర్తి చేశారు. ఈ రెండుచోట్లా 30 వేల 473 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు.


నాగార్జున యూనివర్శిటిలో జరిగే జాబ్ మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇక్కడ  26వేల 289 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఈ జాబ్ మేళా కోసం ఇప్పటికే 97వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారికి వైసీపీ అనుబంధ విభాగాలు సహకరిస్తాయి. ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు. అయితే ఈ జాబ్ మేళాను వైసీపీ నిర్వహించడం విమర్శలకు తావిస్తంది. అయితే.. ఈ జాబ్‌ మేళా  నిర్వహణ వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదంటున్నారు విజయసాయి రెడ్డి.


జాబ్ మేళాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజయసాయి రెడ్డి సూచించారు. గతంలో జరిగిన రెండు జాబ్ మేళాల కంటే నాగార్జున యూనివర్శిటిలో జరిగే కార్యక్రమానికి ఎక్కువ స్పందన లభించిందట. నిరుద్యోగులకు మేలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని అర్థం చేసుకోవాలని.. ఈ జాబ్ మేళాను విజయవంతం చేయాలని విజయసాయి రెడ్డి  కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: