ఎన్నికల విషయంలో ఒకటి ప్లస్ ఒకటి ఎప్పుడూ రెండు కాదని ఓ నానుడి ఉంటుంది. ఎన్నికల్లో అరశాతం ఓట్లు కూడా విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. అధికారానికి ఓ పార్టీని దూరం చేయాలంటే అర శాతం ఓట్ల తేడా కూడా సరిపోతుంది. ఎన్నికల్లో గెలిచామా లేదా అన్నదే ముఖ్యం.. ఎన్ని ఓట్ల తేడా అన్నది విజయ సూత్రం కానే కాదు. అందుకే ఎన్నికల్లో పొత్తులు చాలా ప్రభావం చూపుతాయి.


ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల కోసం అప్పుడే పొత్తుల ఎత్తులు మొదలవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోనని ఇప్పటికే స్పష్టం చేయడం ద్వారా పవన్ కల్యాణ్ మొదట ఈ పొత్తుల వ్యవహారంపై చర్చకు ఆస్కారం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే పవన్ కల్యాణ్.. అబ్బే ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది అంటూ  మాట్లాడుతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదే రీతిలో మాట్లాడుతూ ఓ పంచ్ డైలాగ్ విసిరారు.


వైసీపీ మొదటి నుంచి సింగిల్‌ గానే వస్తోంది. 2014లో ఓడిపోయిన సమయంలోనూ ఆ పార్టీ సింగిల్‌ గానే బరిలో దిగింది. ఓడింది.. మొన్నటి ఎన్నికల్లోనూ సింగిల్‌గానే బరిలో దిగింది.. ఘన విజయం సాధించింది. ఆ పార్టీ పొత్తుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. అయితే.. ఎన్నికల్లో పొత్తులు తప్పుడు వ్యహరారమో.. చేయకూడని పనో కాదు. కానీ వైసీపీ నేతలు కొందరు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్‌గా పోటీ చేసే దమ్ముందా అంటూ సవాళ్లు విసురుతున్నారు.


దీంతో టీడీపీ అధినేతకు మండిపోయింది. అందుకే ఆయన ఓ పంచ్ డైలాగ్ వదిలారు.. ఇదే వైసీపీ అధినేత తండ్రి వైఎస్సార్ కూడా 2009లో ఎన్నికల్లో.. అంతకు ముందు పొత్తులకు వెళ్లాడు.. ఈయన ఆయన కంటే గొప్పవాడా అంటూ ఓ డైలాగ్‌ కొట్టారు. గొప్పవాడు అంటే.. ఇరుకున పడతారు.. కాదంటే.. అలాగూ తంటానే.. అయితే ఆ మాటా నిజమే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లో ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. అయితే అప్పుడు కాంగ్రెస్‌ ఆయన సొంత పార్టీ కాదు.. కానీ.. జగన్ విషయంలో అలా కాదు.. వైసీపీ జగన్ సొంత పార్టీ..అదీ అసలు తేడా.

మరింత సమాచారం తెలుసుకోండి: