ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంక రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. నిరసనకారుల ఆందోళన ఉధృతం కావడంతో పదవికి రాజీనామా చేసిన మహీంద రాజపక్సే ఇప్పుడు ఏకంగా కొలంబో వదిలిపారిపోయారు. ఆందోళన కారుల దాడులతో శ్రీలంక అగ్నిగుండంగా మారింది. కొలంబోను వదిలి పారిపోయిన మహీంద రాజపక్సే.. ట్రింకోమలి నౌకా కేంద్రంలో ఆయన ఆశ్రయం పొందుతున్నట్టు తెలిసింది.


నిరసన కారులు ట్రింకోమలిలోనూ నిరసనలు తెలుపుతున్నారు. అంతే కాదు.. రాజపక్షే మద్దతుదారులు దేశం విడిచి పారిపోకుండా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చుట్టుముట్టారు. చెక్‌ పాయింట్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల వర్గాల ఘర్షణలతో రణరంగంగా మారిన శ్రీలంకలో అవే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.


శ్రీలంకలో కర్ఫ్యూను బుధవారం వరకు పొడిగించారు. రాజధాని కొలంబో సహా కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. కొలంబోలోని మహింద రాజపక్స అధికారిక నివాసంపైనా దాడి జరిగింది. ఆయన నివాస ప్రాంగణంలోకి 10 పెట్రోల్‌ బాంబులను విసిరారు. దీంతో ప్రాణ భయంతో మహీంద కుటుంబం సైన్యం సహాయంతో కొలంబో వదిలి హెలికాప్టర్‌లో పారిపోయింది. ప్రస్తుతం ట్రింకోమలి నౌకా కేంద్రంలో మహీంద కుటుంబం తలదాచుకుంది.


ఇక హంబన్‌టోటలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్న రాజపక్స పూర్వీకుల ఇంటికి  నిప్పు పెట్టారు. మ్యూజియంను ధ్వంసం చేశారు. మ్యూజియంలోని రాజపక్స కుటుంబీకుల మైనపు విగ్రహాలను విరగొట్టారు. రాజపక్స పూర్వీకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గొటబాయ రాజపక్స, మహీంద రాజపక్స నివాసాలు పూర్తిగా కాలిపోయాయి. మహీంద నివాసాలే కాదు.. పలువురు మంత్రుల ఇళ్లకూ ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మహిందను అరెస్టు చేయాల్సిందేనంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆయనను అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాలని మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన డిమాండ్‌ చేశారు. సోమవారం నాటి  ఘర్షణల్లో 8 మంది మృతి చెందారు. 300 మంది వరకూ గాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: