ఉక్రెయిన్‌పై దాడులను రష్యా మరింతగా పెంచేసింది.. ఉన్నట్టుండి ఉక్రెయిన్ పై దాడులు తీవ్రతరం చేసింది. ప్రత్యేకించి ఉక్రెయిన్ ఆయుధాగారాలే లక్ష్యంగా రాకెట్లు, క్షిపణులతో రష్యా దాడులు చేస్తోంది. ఇప్పటికే ఒడెసాలో డ్రోన్లు, డ్రోన్‌ నియంత్రణ కేంద్రాన్ని ఒనిక్స్‌ క్షిపణులతో రష్యా ధ్వంసం చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లోని సియెవెరొదొనెస్క్‌లోనూ రష్యా దాడులతో  భయానక వాతావరణం సృష్టిస్తోంది. ఈ మేరకు రష్యా దాడులపై లుహాన్స్క్‌ గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.


తూర్పు ఉక్రెయిన్‌లోని సియెవెరొదొనెస్క్‌లోని అజోట్‌ రసాయన కర్మాగారం తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ రష్యా స్వాధీనం చేసుకుంది. దక్షిణాన ఉన్న ఒడెసా వైమానిక స్థావరంపై 2 డ్రోన్లతోపాటు డ్రోన్‌ నియంత్రణ కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన ఒనిక్స్‌ క్షిపణులతో దాడి చేసినట్లు రష్యా రక్షణ శాఖ చెప్పుకుంటోంది.


అయితే.. ఈ ప్రకటనను ఉక్రెయిన్‌ ఖండిస్తోంది. ఒడెసా రీజియన్‌లో రష్యా రెండోసారి వైమానిక దాడులు చేసిన మాట నిజమే అయినా.. వాటిని తమ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుందని ఉక్రెయిన్ ప్రకటించింది. అంతే కాదు.. రష్యా క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. తమ దాడుల్లో ఉక్రెయిన్‌ సైన్యానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని రష్యా చెబుతుంటే.. అబ్బే అదంతా ఉత్తదే అంటోంది ఉక్రెయిన్..


అయితే తమ దాడులకు సాక్ష్యంగా  రాకెట్‌ లాంఛర్‌ దాడులకు సంబంధించిన దృశ్యాలను రష్యా సైన్యం విడుదల చేసింది. సియెవెరొదొనెస్క్‌ పారిశ్రామికవాడ శివార్లలోనూ రష్యా రాకెట్‌, వైమానిక దాడులను రష్యా ఉద్ధృతం చేసింది. అజోట్‌ రసాయన కర్మాగారంలో  500 మంది వరకూ పౌరులు,  సైనికులు ఆశ్రయం పొందుతున్నారు. యుద్ధానికి ముందు లక్ష మంది ఉండే ఈ నగరంలో ఇప్పుడు కొంత మందే మిగిలినట్టు ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొన్నేళ్ల పాటు జరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: