ఏపీలో జగన్ సర్కారు మరో బంపర్‌ పథకం ప్రకటించబోతోంది. ఎసైన్డ్‌ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని భావిస్తోంది. అసైన్డ్ భూమి.. పేదలకు, ఇతర వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ భూమి.. సాధారణంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిలో కొందరికి రెండున్నర ఎకరాల మాగాణి వరకూ గతంలో ఎసైన్డ్ చేశారు. అలాగే మరికొందరికి అయిదెకరాల మెట్ట భూమి వరకూ కూడా ప్రభుత్వం వివిధ సందర్భాల్లో కేటాయించింది. ఇలా భూములు ఇవ్వడం ద్వారా లబ్ధిదారు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆలోచించింది.


అయితే.. ఈ అసైన్డ్ భూముల విషయంలో కొన్ని కొర్రీలు ఉన్నాయి. ప్రభుత్వం భూములు, పట్టాలు ఇచ్చినా.. కేవలం వీటిని అనుభవించేందుకు మాత్రమే హక్కు ఉంటుంది. అమ్ముకునే హక్కు ఉండదు. అందువల్ల ఈ భూములను వారసత్వంగా అనుభవించాల్సిందే తప్ప క్రయ, విక్రయాలకు అనుమతులు లేవు. అమ్మినా, కొన్నా అవి చట్టప్రకారం చెల్లవు. అందువల్ల ఈ భూములకు డిమాండ్ ఉండదు. దీని కారణంగా ఈ భూముల  యజమానులకు యాజమాన్య హక్కులు పాక్షికంగానే ఉన్నట్టు లెక్క.


అసైన్డ్ భూముల  బదలాయింపును నిషేధ చట్టం స్పష్టం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరు.. అసైన్డ్ భూములు అని తెలిసినా చాలా మంది వీటిని అమ్ముతుంటారు.. చాలా మంది కొంటుంటారు. అలా అమ్మకాలు జరిగినప్పుడు... అమ్మే వ్యక్తికి మంచి ధర రాదు.. అలాగే కొన్న వ్యక్తికి పూర్తి హక్కులూ రావు. కానీ క్రయ విక్రయాలు ఆగడం లేదు. అందుకే.. ఈ అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పించడమే ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం భావిస్తోంది.


గతంలో ఇంటి స్థలాలకూ ఇదే తరహా నిబంధనలు ఉండేవి. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మే హక్కు ఉండేది కాదు.. కానీ.. జగన్ సర్కారు.. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లను నిర్మించుకుని పదేళ్ల తర్వాత విక్రయించుకునేలా చట్టంలో మార్పులు చేసింది. ఇప్పుడు అసైన్డు భూములకు కూడా ఇలాంటి చట్ట సవరణే చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది. ఇదే అమలులోకి వస్తే.. లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: