నిన్న ప్రధాని మోదీ భీమవరం వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన ఆంధ్ర భూమి గొప్పదనం గురించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ త్యాగధనులకు నమస్కరిస్తున్నానని.. అల్లూరి నడయాడిన అన్ని ప్రాంతాలను స్మరించుకుంటున్నామని అన్నారు. స్వాతంత్ర్య సాధనలో పోరాట పటిమ గురించి అందరికి తెలియాలన్న ప్రధాని మోదీ.. స్ఫూర్తి కోసమే ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు.


ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ... మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి అన్నారు. యావత్‌ భారతావనికి అల్లూరి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అల్లూరి జయంతి రోజు మనందరం కలుసుకోవడం అదృష్టమని తెలుగులో అన్నారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి.. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ప్రధాని.. అలాంటి వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ ప్రసంగించారు.


నిజమే ఆంధ్రప్రదేశ్ వీర భూమి నిజమే.. కానీ ఆ స్ఫూర్తి నేటి నాయకుల్లో ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఏపీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగింది. అందుకు పరిహారంగా అన్నట్టు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో అప్పటి ప్రధాని హామీ ఇచ్చారు. కానీ.. ఆ హామీ నెరవేరనేలేదు. కానీ.. ఈ వీరభూమిలో ఆ విషయం గురించి నిలదీసే మొనగానే కనిపించడం లేదు.


కేంద్రాన్నినిలదీసే వీరుడు ఆంధ్ర భూమిలోనే కనిపించడం లేదు. సీఎం జగన్‌ కానీ.. విపక్ష నేత చంద్రబాబు కానీ.. జనసేనాని పవన్ కల్యాణ్ కానీ.. ఎవరూ ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీయరు.. ఎంతసేపూ ఈ అంశంపై తమలో తాము విమర్శించుకుంటారు తప్పితే.. అసలు దోషి కేంద్రాన్ని నిలదీయరు.. మరి ఇంతటి వీర భూమిలో రాజకీయ వీరులే కనిపించడం లేదు. అల్లూరి వంటి మన్యం వీరులు పుట్టిన భూమిలో మరి అలాంటి వీరత్వం ఏమైంది.. అలాంటి వీరులు ఎక్కడా కనిపించడం లేదే అన్న బాధ సగటు ఆంధ్రుడిని వేధిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: