కేసీఆర్ కరుణ కోసం రాష్ట్రంలో దాదాపు మూడున్నర లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అది కూడా మూడున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా.. వారే ఆసరా పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు. అయితే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 10 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆసరా పింఛను దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు మొలకెత్తాయి. ఈసారైనా ఫించన్‌ వస్తుందా అన్న ఆశలు పొడచూపాయాయి.


తెలంగాణలో అనేక రకాల ఫించన్లు ఇస్తున్నారు.  65 ఏళ్ల వయసు దాటిన వారికి వృధ్ధాప్య ఫించన్‌,  భర్తను కోల్పోయి వితంతువులైన వారికి వితంతు ఫించన్, ఇలా అనేక రకాల కేటగిరీలకు చెందిన వారికి ఫించన్లు ఇస్తునత్నారు. ఇలాంటి వారు దాదాపు 3.3 లక్షల మంది మూడున్నరేళ్లుగా పింఛను ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వీరిలో చాలా మంది దరఖాస్తులు ఇప్పటికే మండల, పంచాయతీ కార్యాలయాల్లో ఓకే అయ్యాయి కూడా. వీరిలో దివ్యాంగులకు నెలకు రూ.3,016 ఫించన్ ఇస్తున్నారు. ఇతర కేటగిరీల వారికి నెలకు రూ.2,016 వరకూ ఫించన్ ఇస్తున్నారు.


అన్ని స్క్రూటినీలు పూర్తి చేసుకున్నా.. రాష్ట్రస్థాయి లాగిన్‌లో ఈ మూడున్నర లక్షల ఫించన్లు నిలిచిపోయాయి. అయితే.. హుజూరాబాద్‌, దుబ్బాక, హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్‌ దరఖాస్తులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించింది. కానీ.. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం అసలు పట్టించుకోలేదు.


ఇక ఇప్పుడు ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం.. ఇవి పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగూ ఎన్నికలు వస్తున్నందున.. ప్రస్తుతం ఈ లాగిన్‌లోని దరఖాస్తులను ఆమోదిస్తే వెంటనే 3.3 లక్షల మందికి పింఛను అందేందుకు వీలుంటుంది. దీనికి తోడు వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించింది. గత ఏడాది ఆగస్టులో ఈ తగ్గింపు ప్రకటించి అదే నెలలో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకుంది. దీనికి  7.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ఫించన్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి కేసీఆర్ ఎప్పుడు కరుణిస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: