కరోనా.. ఇప్పుడు దీని గురించి పెద్దగా ఎవరూ భయపడటం లేదు. చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. అసలు చాలామంది మాస్క్ పెట్టుకోవడమే మరిచిపోయారు. అయితే.. కరోనా మహమ్మారి మరోసారి రెచ్చిపోతోంది.. క్రమంగా దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కేవలం కేసులు పెరగడమే కాదు.. ఆస్పత్రుల్లో చేరికలు కూడా పెరుగుతున్నాయి. ఈ లెక్కలు చూస్తే మరోసారి దేశాన్ని కరోనా కమ్మేస్తుందా అన్న అనుమానం కలుగుతోంది.


ఎందుకంటే.. దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా వైరస్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈనెల ఒకటి నుంచి కరోనా బారిన పడినవారిలో 60శాతం మంది ఆస్పత్రిలో చేరినట్టు అక్కడి ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. కొవిడ్‌ కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ఉన్నా.. ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం పెరుగుతుండటం డేంజర్‌ సిగ్నల్‌ గా భావించాల్సిందే. ప్రస్తుతం దిల్లీలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 19.20శాతం. ఇది గత 200 రోజుల కన్నా ఎక్కువ.


మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. కరోనాతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారిలో 90శాతం మంది బూస్డర్‌ డోసు తీసుకోనివారేనట. దిల్లీలో తాజాగా900లకు పైగా కరోనా కేసులు నమోదైతే.. వారిలో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరినట్టు తెలుస్తోంది. ఈ నెల ఆరంభం నుంచి పరిస్థితి ఇలాగే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఆగస్టు 2న దిల్లీలో 1,506 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 341మంది ఆస్పత్రుల్లో చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. అంతే కాదు..  మరో 105మంది ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చింది. వీరిలో ముగ్గురు మరణించారు కూడా.


ఈ లెక్కలన్నీ చూస్తుంటే.. కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే  ప్రజలంతా మళ్లీ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది. అంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. దిల్లీలో ప్రస్తుతానికి రికవరీ రేటు బాగానే ఉంది. అయినా పాజిటివ్‌ కేసులు, ఆస్పత్రిలో చేరినవారి సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: