తెలంగాణలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. గతంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లిన దృష్ట్యా మరోసారి అదే వ్యూహం పన్నవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ వ్యూహాన్ని పసిగట్టిన విపక్షాలు కూడా ఏ క్షణం ఎన్నికలు వచ్చినా సిద్ధమయ్యేందుకు రెడీ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. కాంగ్రెస్‌ కార్యకర్తలు అంతా సిద్దంగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తాజాగా పిలుపు ఇవ్వడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.


కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రైతులకు కంటతడి పెట్టిస్తున్నధరణిని బంగాళాఖాతంలో కలిపేద్దామని రేవంత్ రెడ్డి అంటున్నారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి, భూ సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో యాస, భాషపై దాడి జరుగుతోందన్న కేసీఆరే ఇప్పుడు మన బతుకులపై దాడి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.


వ్యవసాయాన్ని కార్పొరేట్‌కు కేసీఆర్ కట్టబెట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ద్వజమెత్తారు. మళ్లీ రైతులను కూలీలుగా మార్చాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. లిక్కర్ స్కాంలో ఉన్న వారిని గుంజుకొచ్చి జైల్లో పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్, సోనియాగాంధీలు దర్యాప్తు సంస్థలకు సహకరించి, గౌరవించారని, కానీ బీఎల్ సంతోష్, కవితలు ఎందుకు విచారణకు హాజరు కావడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


కాంగ్రెస్ పార్టీపై కుట్ర చేసి సమస్యలపై చర్చ జరగకుండా చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతు బీమా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్....పంట నష్టానికి బీమా ఎందుకివ్వడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. పంటలబీమా ఇవ్వని కేసీఆర్ రైతుల చావులకు వెలకడుతున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం రైతు సాయం చేయాలంటే రైతు చావాల్సిందేనా అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లు కలిసున్న బీజేపీ, టీఆరెస్ ఇప్పుడు నాటకాలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: