ఆంధ్రప్రదేశ్‌.. విభజన కారణంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా.. ఆ పరిణామం నుంచి కోలుకుని ముందుడుగు వేస్తున్న రాష్ట్రం. విభజన కారణంగా హైదరాబాద్‌ దూరమైందన్న బాధ రాష్ట్ర వాసుల్లో ఉంది. అయితే జరిగి పోయిన దానికి ఎవరూ ఏమీ చేయలేరు. హైదరాబాద్‌ మనకు లేదన్న బాధ కంటే.. అంతకుమించిన అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రతిన పూనడమే ఆంధ్రుల ముందున్న కర్తవ్యం.


హైదరాబాద్‌ ప్రగతిలో ఐటీ రంగం చోదక శక్తిగా పని చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ కూడా ఐటీ రంగంపై దృష్టి సారించాలి. హైదరాబాద్ స్థాయిలో కాకపోయినా మనకూ మెట్రో కల్చర్‌ ఉన్న నగరం విశాఖ. అందుకే విశాఖను ఐటీ క్యాపిటల్‌గా అభివృద్ధి చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో అపార మానవ వనరులు ఉన్నాయి. విద్యావంతులైన యువత లక్షల్లో ఉన్నారు. వారికి సరైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలిస్తే.. ఏపీ ఐటీ రంగంలో దూసుకుపోవడానికి ఎక్కువ కాలం పట్టదు.


ఐటీ రంగంలో ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలు ముందున్నా.. ద్వితీయ స్థాయి కంపెనీలను రాయితీలు, పోత్సాహకాల ద్వారా ఆకర్షించవచ్చు. పారిశ్రామికవేత్తలకు సహకారం అందించడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించవచ్చు. ఇది ఏడాది, రెండేళ్లలో అయ్యే పని కాకపోయినా.. దానికంటూ ఓ రోడ్‌ మ్యాప్‌ తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐటీ రంగ అభివృద్ధికి సుదీర్ఘమైన ప్లాన్‌ రెడీ చేసుకుని ఆచరణ ప్రారంభించాలి.


ఐటీ రంగం గణనీయంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుంది. మన యువత వలసలను ఆపుతుంది. వైజాగ్‌ వంటి నగరాలే కాకుండా.. విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తే.. అటు పారిశ్రామిక వేత్తలకూ.. ఇటు మన ప్రతిభావంతులైన యువతకూ ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుంది. స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించడం అవసరం. తెలంగాణలో ఏర్పాటు చేసిన టీ హబ్‌ వంటి ప్రత్యేక సంస్థలు ఏపీలోనూ ఏర్పాటు చేసుకుని ఒక లక్ష్యంతో ముందుకు సాగితే.. ఏపీ ఐటీ రంగంలో సత్తా చాటడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap