తెలుగుదేశం పార్టీ సీనియర్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు చల్లారు. సీనియర్లను పక్కన పెడుతూ క్యాబినెట్ లో కొత్తవారికి చోటు ఇచ్చి తన మార్క్ చూపించారు.  శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండగా.. వారిలో కొంతమందికే అవకాశం దక్కింది. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒకరి చొప్పున మంత్రి పదవి కేటాయించారు. 25 జిల్లాల నుంచి మంత్రులు ఉండేలా చూసుకున్నారు.


అయితే విశాఖ నగరం నుంచి ఒక్కరికీ అవకాశం లేకపోవడం విశేషం. టీడీపీని చెందిన సీనియర్లు కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, బొండా ఉమా, గద్దె రామ్మోహన్, నందమూరి బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, జీవీ ఆంజనేయులు, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు మంత్రి పదవి ఆశించి భంగపడిన వారిలో ఉన్నారు.


కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ సొంతంగా 134 చోట్ల గెలుపొందింది. దీంతో మంత్రి పదవుల కేటాయింపు కష్టతరంగా మారింది. 21 స్థానాల్లో గెలిచిన జనసేనకి మూడు, ఎనిమిది స్థానాల్లో గెలిచిన బీజేపీకి ఒక్క మంత్రి పదవిని అప్పజెప్పారు. దీంతో పార్టీలోని సీనియర్లకు నిరాశ తప్పలేదు. అయితే చాలా మంది సీనియర్లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇవే తమకి చివరి ఎన్నికలని చెప్పుకొన్నారు. కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ వంటి వారు రిటైర్మెంట్ కి దగ్గరిగా ఉన్నారు.


వీరు తమకు చివరి సారి కాబట్టి అవకాశం వస్తుందని భావించారు. కానీ చంద్రబాబు వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సీనియర్లను నిర్మొహమాటంగా పక్కన పెట్టేశారు. ఇదే సమయంలో యువతకు పెద్దపీట వేశారు. మొదటి సారి ఎన్నికైన వారికి పెద్దపీట వేశారు. మొత్తం మీద పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సీనియర్లు, జూనియర్లతో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు తన మార్క్ చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: