గత సార్వత్రిక ఎన్నికల్లో వైనాట్ 175 అనే నినాదం వినిపించినా.. ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసినా వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 అసెంబ్లీ, నాలుగు లోక్ సభ స్థానాలకు పరిమితం అయింది. దీనికి పలు కారణాలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్ పాలిట యమపాశంగా మారింది. దీనిపై ఎన్నికలకు పది రోజుల ముందు నుంచి టీడీపీ కూటమి భారీ ఎత్తున ప్రచారం చేసింది.


మీ భూములు మీకు దక్కవు అని.. మీ భూమి పట్టాలపై జగన్ ఫొటో ఎందుకు అని.. చివరకు సరిహద్దు రాళ్ల మీద కూడా జగన్ ఫొటో ఉందని టీడీపీ విమర్శించింది. మీ భూములు మీకు దక్కుకుండా పోతాయని పదే  పదే చెబుతూ ప్రజల్లో చర్చకు అవకాశం కల్పించింది. దీంతో వారంతా భూమి పోతుందనే భయంతో టీడీపీకి ఓట్లేశారు. డిజిటల్ సర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు నెల ముందు మండలంలోని నాలుగు వేల ఎకరాల్లో అధికారులు చేత సర్వే చేయించి రైతుల పొలాల్లో రాళ్లను వేశారు. వీటిపై జగన్ ఫొటో కూడా ఉంటుంది.  అయితే ఇప్పుడు మరో సరికొత్త కుంభకోణం బయటకు వచ్చింది.  గనుల శాఖ వారు కొంతమందికి కాంట్రాక్టులు ఇచ్చి ఈ రాళ్లను తయారు చేయించారు.


వాస్తవ ధరకు మించి సుమారు రెండు మూడు రెట్లు అధనంగా వీటికి ఖర్చు పెట్టారు. ఆ రాళ్లపై జగన్ పేరు, లేదా ఫొటో ఉండేలా చూసుకున్నారు. సుమారు రూ.వెయ్యి ఉన్న రాయిని రూ. రెండు, మూడు, నాలుగు వేలకు రైతుల చేత బలవంతంగా కొనిపించారు. అది గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అయింది. దీనివల్ల జగన్ కు చేకూరిన లబ్ధి అంటూ ఏమీ లేదు. కానీ కింది స్థాయి అధికారులు లాభపడ్డారు. దీంతో జనంలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఫలితం ఏమైందో మనం చూశాం.

మరింత సమాచారం తెలుసుకోండి: