ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతికి జవసత్వాలు వచ్చాయి. రాజధాని అమరావతిని ప్రపంచం గుర్తించేలా తీర్చి దిద్దుతామని ఈ ఐదేళ్లలో రాజధాని అమరావతి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు పదేపదే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే.


ఇందులో భాగంగానే అమరావతిపై వడివడిగా అడుగులు వేస్తున్న చంద్రబాబు సర్కారు గత టీడీపీ పాలనలో అసంపూర్ణంగా నిలిచిన కట్టడాల పరిస్థితి అధ్యయంన చేసి వాటి నిర్మాణంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఐఐటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించి వారి సూచనల మేరకు పనులు నిర్వహించాలని చూస్తోంది.  


అయితే అమరావతి రైతులు విషయంతో పాటు పలు కీలక నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం తీసుకుంది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు మరో ఐదేళ్లు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.  


ఇదే సమయంలో సోమవారం నుంచి రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు.. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం. సీఆర్డీఏలో 778 మంది ఉద్యోగులను నియమించుకుంటాం. సీఆర్డీఏ కోసం 32 కన్సల్టీన్సీలు తీసుకోవడానికి అథారటీ నిర్ణయించింది. జగన్ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిని 6993.24 చదరపు కి.మీ. కు కుదించింది. గతంలో లాగానే 8532.69 చ.కి.మీ. పరిధిలో సీఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు.


సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వంతో తిరిగి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. కరకట్ట రోడ్డు నిర్మాణాన్ని త్వరతగతిన చేపట్టాలనుకున్నాం .. కరకట్ట నాలుగు లేన్ల నిర్మాణం చేపట్టనున్నాం. క్యాపిటల్ సిటీ ఎంత వరకు ఉంటే అంత వరకు రోడ్డు నిర్మాణం ఉంటుంది.

అమరావతిలో ఈ-5, 11, 13, 15 రోడ్లను ఎన్ హెచ్ఏకు కలిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమరావతికి ఈఆర్ఆర్, ఓఆర్ఆర్ ఉంటాయన్నారు. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఆరు బ్రిడ్జిలు వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణమే ఉంటుందని తెలిపారు. ఆర్-5 కోర్టు పరిధిలో ఉందని న్యాయ పరిశీలన అనంతరం దానిపై కార్యచరణ ఉంటుందని మంత్రి నారాయణ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: