ఏపీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ అధినేతలు ఎవరైనా సరే.. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తున్నారు. ఒక్కసారి ఓడిపోయామా.. అధికారం పోయిందా బైబై ఏపీ అనేస్తున్నారు. 2019 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జగన్ అదే చేస్తే.. ఆ తర్వాత వైసీపీ హయాంలో చంద్రబాబు కూడా అదే ఫాలో అయ్యారు.


ఇప్పుడు మళ్లీ జగన్ పాత పద్ధతినే అనుసరిస్తున్నారు. ఏపీకి అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం బెంగళూరు పర్యటన గురించే చర్చంతా నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో తక్కువగా కనిపిస్తున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత  మూడు సార్లు బెంగళూరు వెళ్లారు. అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ 19న పులివెందుల వెళ్లిన జగన్.. అక్కడ మూడు రోజుల పాటు ఉండి 24న బెంగళూరుకు వెళ్లారు.


ఆ తర్వాత జులై 15న రెండో సారి వెళ్లారు. ఆరోజు నుంచే తాడేపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు అని పార్టీ వర్గాలు చెప్పినా.. అనుకోకుండా అదే రోజు సాయంత్రం తిరిగి బెంగళూరు వెళ్లిపోయారు. అయితే పదే పదే రాష్ట్రం వదిలి పెట్టడాన్ని కూటమి నేతలు అవకాశంగా మలుచుకుంటున్నారు. దీనిని పదే పదే చూపిస్తూ.. నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.


అయితే గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్లారో ఆ లెక్కలను మాత్రం వారు మరిచిపోతున్నారు. చంద్రబాబు సాంతం హైదరాబాద్ లో ఉన్నా కూడా అంతగా నెగిటివ్ గా చూపని మీడియా.. ఇప్పుడు జగన్ బెంగళూరు వ్యవహారాన్ని పదే పదే భూతద్ధంలో పెట్టి చూపుతుంది.  ప్రజా ప్రతినిధులు కూడా ఆట విడుపు కోరకుంటారు అనే విషయాన్ని మరిచిపోయి వారిపై బురదజల్లేందుకు మీడియా యత్నిస్తోంది. మొత్తం మీద ఏ పార్టీ నాయకులు అయినా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏపీలో ఉండరు అనే విషయం అర్థం అయింది. కానీ జగన్ పై మాత్రమే కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: