ఆకలి రాజ్యం సినిమా గుర్తుందా.. 1970-80 ల నాటి నిరుద్యోగ భారతాన్ని ఆ సినిమా కళ్లకు కడుతుంది. సాపాటు ఎటూ లేదు.. పాటైనా పాడు బ్రదర్ అంటూ నిరుద్యోగుల కష్టాలను కమల్ హాసన్ కళ్లుకు కడతాడు ఈ సినిమాలో.. ఇప్పుడు మళ్లీ అలాంటి రోజులు వస్తాయేమో అనిపిస్తోంది తాజా గణాంకాలు చూస్తుంటే..


ఎందుకంటే.. ఈ ఏడాది అక్టోబరులో దేశంలో నిరుద్యోగ రేటు 8.5 శాతంగా నమోదైంది. ఇది గడచి మూడేళ్లలో ఆల్ టైమ్ హై అన్నమాట. తాజాగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2016 ఆగస్టు తర్వాత దేశంలో నిరుద్యోగ రేటు ఇదే అత్యధికం.


ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది.. ? దేశంలో కీలక రంగాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సెప్టెంబరులో తయారీ రంగం 5.2శాతం క్షీణించింది. దశాబ్దంలోనే ఇది ఆల్ టైమ్ లో. తయారీ రంగ కార్యకలాపాలు కూడా అక్టోబరులో బలహీనంగా ఉన్నాయి.


కొనుగోళ్లు లేకపోవడంతో కంపెనీల్లో నిల్వలు పేరుకుపోయి తయారీ రంగం క్షీణించింది. ఈ నేపథ్యంలో కొత్త ఉద్యోగాల కల్పన కూడా ఆరునెలల కనిష్ఠానికి తగ్గింది. ఫలితంగా నిరుద్యోగం పెరిగింది. సెప్టెంబరులో నిరుద్యోగరేటు 7.2శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: