ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ వైద్య విద్యను అభ్యసించాలనుకునే ప్రధమ సంవత్సర విద్యార్థులను తమ ప్రైవేటు కళాశాలలో చేర్చుకుంటామని రాష్ట్ర ప్రైవేట్‌ వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం తాజాగా ప్రకటించింది. వైద్య విద్యార్థులను మెడికల్, డెంటల్ కళాశాలలో జాయిన్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రైవేటు వైద్య కళాశాల యాజమాన్యం సోమవారం నాడు పచ్చ జెండా ఊపింది. హైకోర్టు తుది తీర్పు ను గౌరవిస్తూ కోర్టు చెప్పినట్టుగానే విద్యార్థుల నుంచి ప్రభుత్వ కళాశాలలో ఎంత ఫీజులు చెల్లిస్తున్నారో అదే ఫీజ్ ని తాము తీసుకుంటామని, 2020-21 సంవత్సరానికి పీజీ వైద్య విద్య అడ్మిషన్స్ అతి త్వరలోనే తెరవనున్నామని ప్రైవేటు వైద్య కళాశాల యాజమాన్యం తెలిపింది. 


ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయమని తెలిపారు. కొన్ని రోజుల క్రితం ప్రైవేటు కళాశాలల, ప్రభుత్వ కళాశాల ఫీజ్ విషయంలో విభేదాలు వచ్చాయని... దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యం పీజీ వైద్య విద్య ను తక్కువ ఫీజులకు అందించలేమని చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రైవేటు కళాశాలలో లక్షల రూపాయల్లో విద్యార్థుల నుండి ఫీజులను కట్టించుకునే వారు. అదే కొనసాగాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యం మొన్నటి వరకు డిమాండ్ చేసింది. కానీ ఈరోజు ప్రభుత్వ కళాశాలల తో సరి సమానంగా ఫీజులను కట్టించుకుంటామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యం తెలపడం ప్రస్తుతం విద్యార్థులకు సంతోషాన్నిస్తుంది. 


ఇకపై వైద్య విద్యను అభ్యసించాలని అనుకునే పేద వారు కూడా ప్రైవేట్ కళాశాలలో తక్కువ ఫీజులు కట్టి తమ పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవచ్చు. ప్రైవేటు కళాశాలల్లో చదువుకుంటున్న చాలా మంది వైద్య విద్యార్థులు ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువు ఆపేశారు. అయితే ఈ విద్యార్థుల సమస్యను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు కళాశాలలో తక్కువ ఫీజులు కట్టించుకోవాలి అనే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ధిక్కరించి కోర్టుకెక్కిన ప్రైవేటు కళాశాల యాజమాన్యానికి చుక్కెదురైంది. ఎట్టకేలకు ప్రభుత్వం చెప్పినట్టే పేద మధ్య తరగతి విద్యార్థులకు తక్కువ ఫీజులను తీసుకుంటామని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: