నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు, సెల్‌ఫోన్‌లు ఉన్నా... గ్రామీణ ప్రాంతాలు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. పాఠశాలలు, విద్యాసంస్థలన్నీ మూతపడటంతో ముఖ్యంగా ప్రత్యేక అవసరాలుగల పిల్లల విద్యాభ్యాసానికి దోహదపడే అనుబంధ సామగ్రి, సదుపాయాల కల్పనలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకించి అంధులు, బదిరులు వంటి దివ్యాంగ విద్యార్థులకు ఉపయోగపడే విద్యావనరులు, మౌలిక సదుపాయాలు లభ్యమయ్యే పరిస్థితులు లేవు. ఇలాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లలు స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌లతో ప్రయోజనం పొందడం తక్కువే. సాధారణంగా పాఠశాల వాతావరణంలో అందుబాటులో ఉన్న వసతుల మధ్య పొందే అనుభూతి ఆన్‌లైన్‌-డిజిటల్‌ విజ్ఞాన ప్రపంచంలో పొందలేరన్నది సుస్పష్టం. 

 


 కొవిడ్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థలో అసమానతలకు కారణమైంది. ఈ సంక్షోభ సమయంలో పేద, అల్పాదాయ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపు 40శాతం చిన్నారులు సరైన విద్యను పొందలేకపోయారని యునెస్కో తాజా నివేదిక వెల్లడించింది. మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వ పాఠశాలల మీదే ఆధారపడిన పేద, దిగువ మధ్యతరగతి పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తృతిని కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థుల చదువులు అటకెక్కినట్లు ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక-2020 పేర్కొనడం- కరోనా మహమ్మారి విద్యావ్యవస్థపై చూపిన ప్రభావానికి అద్దం పడుతోంది. దాదాపు అన్ని దేశాల్లో ఏప్రిల్‌ నెల నుంచి పాఠశాలలు మూతపడటంతో 91శాతం పిల్లలు విద్యాసంస్థలకు దూరమయ్యారు. ప్రత్యక్ష విద్యాభ్యాసానికి దూరమైన పరిస్థితుల్లో పలు విద్యాసంస్థలు దీనికి పరిష్కారంగా దూరవిద్యా పద్ధతిని ఎంచుకున్నాయి. ఇలాంటి ఏర్పాట్లన్నీ తరగతి గది విద్యకు అసంపూర్ణ ప్రత్యామ్నాయ మార్గాలేనని నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. లాక్‌డౌన్‌ కాలంలో చాలా వరకు పేద దేశాలు విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడానికి రేడియో, టీవీల్లో ప్రభుత్వ ప్రసార సాధనాలనే మాధ్యమాలుగా ఎంచుకున్నాయి.

 

 

అందరికీ విద్య, వైద్య సదుపాయాలు అందించడంలో అసమానతలు, అంతరాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉండగా కరోనా మహమ్మారితో విద్యావ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురైంది. ప్రభుత్వ పాఠశాలలపై ఎక్కువగా ఆధారపడినవారు గ్రామీణ, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు చెందిన చిన్నారులే కావడంతో- వాళ్లు ఆన్‌లైన్‌ విధానంలోని అవకాశాలను అందిపుచ్చుకోలేక పోతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ స్మార్ట్‌ఫోన్‌లు, తగిన అంతర్జాల సదుపాయం, వాటిని ఉపయోగించే విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఆన్‌లైన్‌ విద్యావిధానంలో ఉన్న ప్రయోజనాన్ని వినియోగించుకోలేక పోతున్నారని యునెస్కో నివేదిక స్పష్టం చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: