తెలంగాణాలో ఇంజ‌నీరింగ్ కాలేజీల యాజ‌మాన్యాలు ఆందోళ‌నబాట ప‌ట్ట‌బోతున్నాయి. గ‌త రెండేళ్లుగా... రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల‌కు చెల్లించాల్సిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో కాలేజీలు న‌డ‌ప‌లేమంటూ ప్ర‌క‌టించ‌బోతున్నాయి. ఇదే బాట‌లో ఇంట‌ర్ కాలేజీలు సైతం ఆందోళ‌న బాట ప‌ట్టేందుకు క‌స‌ర‌త్తు చేసుకుంటున్నాయి. అయితే ఉప‌కార వేత‌నాలు.. రీయంబ‌ర్స్ మెంట్ అంద‌క విద్యార్థులు ఆందోళ‌న‌లో ఉన్నారు. ఫీజు క‌డితేగానే టీసీలు ఇవ్వ‌మని కాలేజీ యాజ‌మాన్యాలు చెబుతుండటంతో వెంట‌నే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుద‌ల చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ చెల్లించ‌క‌పోవ‌డంతో కాలేజీల యాజ‌మాన్యాలు టీసీల‌ కోసం మొత్తం ఫీజులు వ‌సూలు చేస్తున్నాయ‌ని, ఫీజులు క‌ట్ట‌లేని విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంట‌ున్నార‌ని ఆ సంఘాల నాయకులు మండిప‌డుతున్నారు.

నిజానికి గ‌డిచిన రెండేళ్లుగా తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప‌థ‌కం అట‌కెక్కింది. పేద‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , ఈబీసీ విద్యార్థుల‌కు ఉప‌కార వేత‌నాలు అంద‌క కాలేజీల యాజ‌మాన్యాలు నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2019-20,. 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి గాను స‌ర్కార్ ఇచ్చే ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ కింద దాదాపు నాలుగు వేల కోట్లు కాలేజీలకు బ‌కాయిలు ప‌డింది. ఇంట‌ర్మీడియ‌ట్ నుంచి పైస్థాయి కోర్సుల వ‌ర‌కు దాదాపు 12 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ఉప‌కార వేత‌నాలు, బోధనా రుసుం ఇప్ప‌టివ‌ర‌కు అంద‌లేదు.

ఇక చెల్లించాల్సిన బకాయిల‌కు సంబంధించి ఈ ఏడాది మార్చి 31నాటికే రూ.1500 కోట్ల నిధుల‌కు టోకెన్లు జారీ చేసింది. అయినప్పటికీ క‌రోనా కార‌ణంగా నిధులు లేవ‌ని రాష్ట్ర స‌ర్కార్ సాకులు చెబుతోందని, ఆ టోకెన్ల‌ను ర‌ద్దుచేశారంటూ ప్రైవేట్ కాలేజీల యాజ‌మాన్యాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని నిధులు విడుద‌ల చేస్తున్నా.. అవి టీఆర్ఎస్ స‌ర్కారులో ఉండే బంధువుల కాలేజీల‌కు మాత్ర‌మే నిధులు పోతున్నాయ‌న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మిగ‌తా కాలేజీల‌కు ఫీజు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కాలేజీల యాజమాన్య సంఘాలు మండిప‌డుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసుకొని... త‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని ఇంజ‌నీరింగ్, ఇంట‌ర్ కాలేజీల సంఘాలు ప్ర‌క‌టించాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: