తెలంగాణలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ప్రతిష్ట మసకబారుతోంది. యూనివర్సిటీలు ఒక్కొక్కటిగా స్వయం ప్రతిపత్తిని కోల్పోతున్నాయి. వాటికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో 11 ప్ర‌భుత్వ యూనివ‌ర్సిటీలు ఇక అలంకార ప్రాయంగానే మార‌బోతున్నాయి. వాటికున్న స్వంతంత్ర అధికారాలను ఒక్కొక్క‌టికి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. ఒక‌ప్పుడు ఏ యూనివ‌ర్సిటీకి ఆ యూనివ‌ర్సిటీనే సీట్ల భ‌ర్తీ చేసుకునేది. సొంత‌ంగా అధ్యాప‌కుల‌ను సైతం నియ‌మించుకునేది. అటాన‌మ‌స్ బాడీలు కోర్సుల ద‌గ్గ‌ర‌ నుంచి సిల‌బ‌స్ వ‌ర‌కు... స‌ర్వాధికారాలు ఉప కులపతులకు ఉండేవి. కానీ మారుతున్న ప‌రిస్థితుల్లో విశ్వ‌విద్యాల‌యాలు త‌మ సొంత అధికారాలు కోల్పోయి రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావాల్సి వ‌స్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి యూనివర్సిటీలకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తోందనీ, వాటి అస్తిత్వానికే ఎసరు పెడుతోందనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.. ఎలాంటి చర్చలు లేకుండానే యూనివ‌ర్సిటీ పరిధిలోకి కీల‌క నిర్ణయాలు తీసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు ప‌రుస్తున్నాయి. ఇప్పటికే డిగ్రీ, పీజీ అడ్మిషన్లను సెంట్రలైజ్ చేసిన సర్కారు.. అకడమిక్ అంశాలనూ తన చేతిలోకి తీసుకుంది. తాజాగా పీహెచ్‌డీ సీట్లతో పాటు ప్రొఫెసర్ పోస్టుల భర్తీని కూడా సెంట్రలైజ్ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.

గతంలో ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ డిగ్రీ సీట్లను భర్తీ చేసుకునేవి. పీజీ సీట్ల భర్తీకి ఓయూ సెట్, కేయూ సెట్‌ పేరుతో ప్రవేశ పరీక్షలు నిర్వహించి సీట్లను భర్తీ చేసేవి. అయితే ఆరు సంప్రదాయ వర్సిటీల్లోని డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి 2018–19లో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్ తెలంగాణ- దోస్త్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దోస్త్ పరిధిలోని కాలేజీలకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అని ప్రకటించారు. 2019–20 అకడమిక్ ఇయర్ నుంచి కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టు - సీపీగెట్ పేరుతో పీజీ కోర్సులకూ ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో వర్సిటీలు సొంతగా అడ్మిషన్లు చేసుకునే విధానాన్ని సర్కారు దెబ్బతీసినట్లయింది.

రాష్ట్రంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో మొత్తం  11 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివ‌ర్సిటిల అభివృద్దికి ఏ యేటికి ఆ ఏడాది బడ్జెట్‌లో వర్సిటీలకు కేటాయించే నిధులు తగ్గిపోతున్నాయి. వర్సిటీల డెవలప్‌మెంట్‌ కోసం కాదు కదా.. కనీసం జీతాలకు కూడా సరిపోయేన్ని నిధులు ఇవ్వడం లేద‌ని యూనివ‌ర్సిటి అధ్యాప‌క సంఘాలు అగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: