అక్కడ రైల్వే స్టేషన్ ఒక కోచింగ్ సెంటర్ అయిపోయింది. అక్కడ ఎక్కడ చూసినా  విద్యార్థులు ఏదో ఒకటి చదువుకుంటూనే ఉంటారు. తమ లక్ష్యాలను అక్కడకు వచ్చి తర్ఫీదు పొంది సాధించుకుంటారు. ఎప్పుడూ అక్కడ విద్యార్థులే కనిపిస్తుంటారు. అదెక్కడ అంటే, బీహార్ లోని రోహతాస్ జిల్లాలోని సాసారాం రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్, దానిలో రెండు ఫ్లాట్ ఫారాల లో ఎక్కడ చూసినా విద్యార్థులు చదువుకుంటూనే కనిపిస్తుంటారు. కాస్త పెద్దవాళ్ళు, పట్టు ఉన్నవాళ్లు, తమకంటే చిన్న వాళ్లకు పాఠాలు చెపుతూ కనిపిస్తుంటారు అక్కడ. అయితే ఇదంతా సూర్యోదయానికి ముందు, తరువాత అక్కడ రోజు కనిపించే వాతావరణం.

పేరుకు అది రైల్వే ఫ్లాట్ ఫారం కానీ ఆయా సమయాలలో చూస్తే ఏదో కోచింగ్ సెంటర్ కు దారితప్పి వెళ్ళినట్టే ఉంటుంది. పొద్దు పొడవటానికంటే ముందే వందల మంది విద్యార్థులు అక్కడకు చేరుకుంటారు, మళ్ళీ పొద్దు గూకగానే ఇదే పరిస్థితి అక్కడ. కారణం పేదరికం బాగా పేరుకుపోయిన ప్రాంతం రోహతాస్ జిల్లా. ఇప్పటికి అక్కడ చాలా ఊళ్లకు కనీస సమయం వరకు కూడా విద్యుత్ సరఫరా లేదు. అందుకే సూర్యుడి వెలుగు తగ్గగానే చదువుకునే వాళ్ళందరూ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అలాగే ఉదయం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ విద్యార్థులు ఉన్న ప్రాంతాలలో కనీస విద్యుత్ సౌకర్యాలు లేనందున ఆ స్టేషన్ లైట్స్ కింద కూర్చుని చదువుకొని వెళ్తున్నారు.  

సాయంత్రం అయితే చాలు ఆ ఒక్క స్టేషన్ తప్ప అన్ని గ్రామాలు చీకటిలో మగ్గి పోవలసిందే. అందుకే అక్కడి విద్యార్థులు ఈ స్టేషన్ లైట్స్ కిందకు చేరుకుంటారు. ఈ స్టేషన్ లో మాత్రం 24 గంటల విద్యుత్ సదుపాయం ఉంది. దీనితో చుట్టుపక్కల చదువుకునే వాళ్ళు అంతా ఈ స్టేషన్ కు వచ్చి చదువుకుంటారు. ఇలా ఈ విద్యార్థులంతా కూడా 2002 నుండి అక్కడే అదేవిధంగా విద్యను కొనసాగిస్తున్నారు. ఇటీవల ఛత్తీస్ ఘడ్ కేడర్ కు చెందిన ఒక ఐఏఎస్ దీనిని చూసి సామజిక  మాధ్యమాలలో పంచుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా పరిస్థితి మారిందో లేదో తెలియాల్సి ఉంది.ఏమైనా ఆ విద్యార్థుల దీక్ష ప్రశంసనీయం. వారైనా తమ ఊళ్లకు విద్యుత్ సదుపాయం తెచ్చుకోగలరని ఆశిద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: