గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఓ వ్యక్తి చెప్పిన చిన్న అబద్ధం.. ఓ రాష్ట్రమంతా లాక్‌డౌన్ విధించడానికి కారణమైంది. 17.5 లక్షల జనాభాను కంగారు పడేలా చేసింది. పైగా అతడు విదేశీయులు ఐసోలేషన్‌లో ఉండే ఓ ప్రముఖ హోటల్‌ ఉద్యోగి కావడంతో గందరగోళం నెలకొంది. సౌత్ ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ నగరం అడిలైడ్‌లో విదేశీయులు ఐసోలేషన్‌లో ఉండే ఓ ఖరీదైన హోటల్‌‌లో సహాయకుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. దీంతో అక్కడ స్వీయ నిర్బంధంలో ఉన్నవారంతా ఆందోళనకు గురయ్యారు. అతడు ఎక్కడికి వెళ్లాడు? ఎవరి నుంచి వైరస్ వ్యాపించింది? తదితర వివరాలను తెలుసుకునేందుకు అధికారులు వచ్చారు. నగరంలోని ఓ ప్రముఖ పిజ్జా బార్‌లో పిజ్జా కొనుగోలు చేసేందుకు వెళ్లానని ఆరోగ్య సిబ్బందితో సదరు వ్యక్తి అబద్ధం చెప్పాడు. అయితే.. అతడికి ఎవరి వల్ల వైరస్ సోకిందో తేల్చలేక అధికారులు తలలు పట్టుకున్నారు. అంతేకాకుండా.. ఆ పిజ్జా షాపునకు వచ్చిన కస్టమర్లందరికీ వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మెల్‌బోర్న్ నగరంలో కొంత మంది చేసిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగా వందలాది మందికి వైరస్ సోకింది. ఇది కరోనా సెకండ్ వేవ్‌‌కు దారి తీసింది. ఈ నేపథ్యంలో అడిలైడ్ ఘటనతో సౌత్ ఆస్ట్రేలియాలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. అయితే.. సదరు వ్యక్తికి ఎక్కడ నుంచి వైరస్ అంటుకుందో ట్రేస్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఆరు రోజుల పాటు కఠినమైన లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని సౌత్ ఆస్ట్రేలియా ప్రిమియర్ ప్రకటించారు. అధికారులు ఆ కేసును ట్రేస్ చేయడానికి శథవిధాలా ప్రయత్నించారు. ఈ క్రమంలో వారికి అసలు విషయం తెలిసింది. ఐసోలేషన్ హోటల్‌లో సహాయకుడిగా పనిచేస్తున్న ఆ వ్యక్తి.. పిజ్జా పార్లర్‌లో పార్ట్ టైమ్ జాబ్‌ చేస్తున్నట్లు తేలింది. అక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తు్న్నట్లు చెప్పుకోలేక పిజ్జా కొనడానికి వెళ్లానని అబద్ధం చెప్పాడు.

పిజ్జా పార్లర్‌లో పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు వల్ల ఆ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు అధికారుల విచారణలో తెలిసింది. అసలు విషయం తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్న సౌత్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఆ వెంటనే లాక్‌డౌన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అక్కడ విధించిన ఆరు రోజుల లాక్‌డౌన్‌ మూడు రోజుల ముందే ముగిసింది. శనివారం (నవంబర్ 21)తో నిర్భందం ముగిసింది. ‘ఓ వ్యక్తి విచక్షణా రహిత చర్య రాష్ట్రం మొత్తాన్ని ఇబ్బందుల్లో పడేసింది. ఆ వ్యక్తి అధికారులకు నిజం చెప్పి ఉంటే లాక్‌డౌన్‌ పరిస్థితి వచ్చేది కాదు’ అని సౌత్ ఆస్ట్రేలియా ప్రిమియర్‌ స్టీవెన్‌ మార్షల్‌ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: