పూర్వకాలంలో చాలా పెద్ద వయస్సు కలిగిన వారికి మాత్రమే రక్తపోటు సమస్యలు ఎదురయ్యేవి. కానీ మారుతున్న జీవనశైలిలో ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, తగ్గిన శారీరక శ్రమ, అధిక బరువు తదితర అంశాల కారణంగా మరి చిన్న వయసు వారికే రక్తపోటు సమస్య రావడం వింత గా మారింది. నిజానికి రక్తపోటు అంటే రక్తాన్ని శరీర భాగాలకు పంపడంలో గుండె ముఖ్యపాత్ర వహిస్తుంది. రక్తనాళాల నుంచి రక్తం ప్రవహిస్తున్నప్పుడు నాళాల గోడల పై ఒత్తిడి పడుతుంది.  దీనినే మనం రక్తపోటు అంటాము.


రక్త సరఫరా ప్రక్రియలో భాగంగా గుండె సంకోచ, వ్యాకోచాలకు లోనవుతుంది. ఇక గుండె సంకోచించినప్పుడు రక్తం గుండె నుండి రక్త నాళాల లోనికి వేగంగా వత్తిడితో ప్రవహిస్తుంది. దీన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. గుండె తిరిగి వ్యాకోచించి సాధారణ స్థితికి వచ్చినప్పుడు నాళాలలో కలిగే ఒత్తిడిని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ అంటారు. సగటు సాధారణ మనిషి రక్తపోటు అంటే 120/80 గా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. అందులో పై సంఖ్యను సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ గా, కింది సంఖ్యను డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ గా పరిగణిస్తారు. ఒక్కొక్కరిలో ఒక్కోలా బీ పీ హెచ్చుతగ్గులు ఉంటాయి. వయసు, ఆహారపు అలవాట్లు, మానసిక స్థితి, కుటుంబ పరిస్థితులు ఇలా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి.


రక్త పోటు మన శరీరంలో దీర్ఘకాలికంగా కొనసాగితే మాత్రం, ముఖ్య అవయవాల పనితీరు దెబ్బతింటుంది. అలాగే హార్ట్ ఎటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్  వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. అంతేకాకుండా కంటి జబ్బులు,పక్షవాతం వంటి సమస్యలు చుట్టుముడతాయి. అయితే రక్తపోటుకి ప్రత్యేకమైన లక్షణాలు అంటూ ఏవి ఉండవనే చెప్పాలి. సాధారణంగా వచ్చే సమస్య లు తలనొప్పి, తల తిరిగినట్లు ఉండడం, కింద పడిపోయినట్లు అనిపించడం, కోపం లాంటి ఇబ్బంది తదితర సాధారణ లక్షణాలను బట్టి మనం అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది.

ముందు జాగ్రత్తగా ప్రశాంత జీవనం గడపడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం, యోగా, ధ్యానం లాంటివి చేస్తూ ఉండాలి. అలాగే కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవడం, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.  ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా బాడీమాస్ ఇండెక్స్ కు అనుగుణంగా బరువు ఉండేలా చూసుకోవడం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు ఎక్కువగా తినడం, మందులను సక్రమంగా వాడడం వల్ల రక్తపోటు రాకుండా నివారించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: