తెలంగాణ‌లో క‌రోనా కేసులు కాస్త ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. రోజు రోజుకు కేసులు విప‌రీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. గ‌త మూడు రోజులుగా రాష్ట్రంలో క‌రోనా కేసులు వేగంగా విస్త‌రిస్తూ ఉన్నాయి. నిన్న 1,500 దాటిన కేసులు ఇవాళ 2వేల‌కు చేరువ‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 54,534 క‌రోనాకు సంబంధించిన నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1,913 నూత‌న కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదు అయిన కేసుల సంఖ్య 6,87,456 కు చేరింది. ఈ మేర‌కు వైద్యారోగ్య‌శాఖ గురువారం బులెటిన్ విడుద‌ల చేసిన‌ది. తాజాగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే అత్య‌ధిక 1,214 కేసులు న‌మోదు అవ్వ‌డం విశేషం.
 
ఇక గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో క‌రోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్ప‌యిన‌ట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో మృతుల సంఖ్య 4,036 వ‌ర‌కు  చేరింది. క‌రోనా నుంచి బుధ‌వారం 232 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 7,847 ఐసోలేష‌న్‌, యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు బులెటిన్‌లో తెలిపారు. ఇక ఒమిక్రాన్ కేసుల‌పై వైద్యారోగ్య‌శాఖ ఇంకా ఏ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. పెరుగుతున్న నేప‌థ్యంలో అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో  క‌రోనా థ‌ర్డ్‌వేవ్ మొద‌లైంద‌ని డీహెచ్ శ్రీ‌నివాస‌రావు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అయితే న‌మోద‌య్యే కేసుల్లో తీవ్ర ప్ర‌భావం ఏమి లేద‌ని, ఆసుప‌త్రుల‌లో ఎక్క‌డ ఎక్కువ సంఖ్య‌లో రోగులు చేర‌డం లేద‌ని తెలిపారు.

ఒమిక్రాన్ బారిన ప‌డిన వారు కూడా 5 రోజుల్లోనే కోలుకుంటున్నారు అని తెలిపారు. ప్ర‌జారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే వైద్య సిబ్బందికి సెల‌వులు ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టిచామ‌న్నారు. ఇక సంక్రాంతికి క‌రోనా కేసులు మ‌రింత పెరిగే ప్ర‌మాద ఉంద‌ని డీహెచ్ హెచ్చ‌రించారు. రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జా సంఘాలు వ‌చ్చే నాలుగు వారాల పాటు అన్నీ కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల‌ని సూచించారు. ప్ర‌జ‌లంద‌రూ వైద్యారోగ్య శాఖ‌కు స‌హ‌క‌రిస్తే ఫిబ్ర‌వ‌రి నెల‌లో మ‌ళ్లీ కేసులు త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ద‌ని డీహెచ్ శ్రీ‌నివాస‌రావు  తెలిపారు. ప్ర‌తీ ఒక్క‌రూ త‌ప్ప‌కుండా మాస్క్ ధ‌రించి, ఎప్ప‌టిక‌ప్పుడు చేతుల‌ను శానిటైజ్ చేసుకుంటూ.. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: