తెలంగాణలో భద్రాద్రి జిల్లా, పాల్వంచ  మండలం, ఉలవనూరు గ్రామ పంచాయితీ పరిధిలోని సిర్తనపాడు హామ్లెట్‌ (ఆవాసం)లో శనివారం ఉదయం ఇరవై అయిదేండ్ల పాడెం జ్యోతి విషజ్వరంతో లేవలేని స్దితిలో మంచాన పడింది. సమీపంలో ఆసుపత్రి లేదు. అక్కడి నుండి బయట ప్రపంచంలోకి రావడానికి రహదారులు లేవు. 

ఆమె ఆనారోగ్యం గురించి   తెలుసుకున్న, ఆ గ్రామ సమీపంలోని వైద్య సేవలందిస్తున్న హోమియో వైద్యుడు ఆర్‌.నరేందర్‌ ఆమె ఉన్న చోటుకు వచ్చి, రోగిని పరీక్షించి, సీరియస్‌గా ఉందని గమనించి, సరైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లాలని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారికి బయటకు  వెళ్లే మార్గం లేక నిరాశగా దిక్కులు చూడడంతో , డాక్టర్‌ నరేందర్‌ మరో ముగ్గురి సాయంతో జెట్టీ కట్టి, నాలుగు కిలోమీటర్లు ఆ పేషెంట్‌ని మోసుకుంటూ నడిచి ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చారు.

వారి అదృష్టం కొద్దీ, ఆంబులెన్స్‌ దొరకడంతో, కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో జ్యోతిని చేర్పించారు. సరైన సమయానికి ఆసుపత్రికి చేర్చడం వల్ల ఆమె ప్రాణాలు దక్కాయని వైద్యులన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 200 గొత్తికోయల కుటుంబాలు జీవిస్తున్నాయి కానీ, వారికి విద్య,వైద్యం,తాగునీటి వసతి లేవు. గత రెండేళ్లుగా డాక్టర్‌ నరేందర్‌ వారి మధ్యనే ఉంటూ వీలైనంత సాయం చేస్తూ,వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్తున్నారు.

 '' గత నాలుగు దశాబ్దాల ల క్రితం ఛత్తీస్‌ ఘడ్‌ నుండి ఇక్కడికి వలస వచ్చిన గొత్తి కోయలు ప్రకృతి వడిలో పోడు సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. వాగులు,చెలమల్లో బురద నీరు తాగడం వల్ల తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. సరైన పౌష్టికాహారం లేక రక్త హీనత తో బాధ పడుతున్నారు. ఈ పమస్యలన్నీ పాలనాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. త్వరలో పరిష్కరిస్తాం అన్నారు...'' అని, నరేందర్‌...  ఈ విలేకరికి భద్రాచలం అభయారణ్యం నుండి జ్యోతమ్మను జెట్టీ లో మోసుకొని వెళ్తూ ఫోన్‌లో వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: