ఒక ఉదయం, నోకియా ఫోన్‌ రింగ్‌ అయింది. 'మేటర్‌ సీరియస్‌.. నందిగామ నుండి మా బంధువులొచ్చారు. వారి నెలల పాపకు హార్ట్‌ప్రాబ్లం.. ఏమైనా హెల్ప్‌ చేయగలమా?' అవతల ఆందోళనగా మిత్రుడు మురళి. అతడు 'ఈనాడు' లో పని చేసి సొంతంగా మంత్లీ మ్యాగజైన్‌ పెట్టుకున్నాడు. దానికి కంటెంట్‌ అందిస్తుంటాను. అలా మా స్నేహం కుదిరింది.

 11గంటలకు టీవీ9 ఆఫీసులో మిత్రుడు, సీనియర్‌ జర్నలిస్టు చంద్రమౌళి దగ్గరున్నాం. ' మీ బ్రదర్‌ హార్ట్‌ స్పెషలిస్టు కదా ఈ పసిబిడ్డను కాపాడాలి గురూ?' అన్నాను.
12గంటలకు బంజారాహిల్స్‌లో స్టార్‌ ఆసుపత్రికి పసిబిడ్డనుతీసుకుని నందిగామ జంట వచ్చారు. వారికి రెండెకరాల పొలం తప్ప ఏమీ లేదు. వ్యవసాయం మీద బతుకు తున్నారు. లేక, లేక పుట్టిన బిడ్డకు ఇలా కావడంతో ఆ తల్లి కన్నీళ్లు పెడుతోంది. టెస్టులన్నీ అయ్యాక తేలిందేంటంటే , దాదాపు 3లక్షలు ఖర్చువుతుంది. మీరు జర్నలిస్టులు కాబట్టి కొంత తగ్గుతుంది. వెంటనే ఆ బిడ్డ తండ్రి,మరేమీ ఆలోచించ కుండా, ఎవరికో ఫోన్‌ చేసి పొలం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోమని, చెబుతున్నాడు. తాకట్టు సాధ్యం కాక పోతే అమ్మకానికి పెట్టమంటున్నాడు...

అతడిని కొంచెం ఓపిక పట్టమని చెప్పి, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అని అడిగాను. లేదు, రేషన్‌ కార్డు ఉందన్నాడు. దానిని పట్టుకొని సీఎం క్యాంపు ఆఫీసుకు చేరుకున్నాం. ఆ పసిబిడ్డ ధీన స్ధితిని వివరించి, అక్కడ ఆరోగ్యశ్రీనెట్‌వర్క్‌ కౌంటర్‌లో ఇచ్చి నా అక్రిడేషన్‌ కార్డు చూపించి పరిచయం చేసుకున్నాను. వారు రిపోర్టులో వివరాలు కంప్యూటర్‌లో ఫీడ్‌ చేసుకొన్నారు.
సీన్‌ కట్‌ చేస్తే,
వారం తరువాత నందిగామ జంట సంతోషంగా లక్డీకపూల్‌లో మురళి ఆఫీసులో కనిపించారు.' ఒక్క రూపాయి కూడా ఖర్చుకాకుండా ఆపరేషన్‌ సక్సెస్‌. మా బిడ్డ బతికింది, మా బతుకు తెరువైన పొలం కూడా దక్కింది.' అంటూ ఉధ్వేగంగా చెప్పారు. '' థ్యాంక్స్‌ మాకు కాదమ్మా, ఆరోగ్యశ్రీని తెచ్చిన సీఏం వైఎస్‌ గారికి చెప్పండి.. '' అన్నాను. ఇదంతా 2008లో సంగతి. పేదోడికి నమ్మకాన్ని, భరోసాను ఇచ్చిన ఆ మహానేత జయంతి నేడు !! 

 (imaginary images from google/ report Shyammohan)




మరింత సమాచారం తెలుసుకోండి: