వీళ్లకు రోగాలు వస్తే, వైద్యుడి కోసం,వాగులు వంకలు దాటి, మైళ్ల కొద్దీ ఇలా నడవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ, లక్ష్మిదేవిపల్లి మండలాల్లోని మారుమూల అటవీప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీల నిత్యజీవన సమరం ఇది.


వేముల మాసి అనే మహిళ ఆనారోగ్యం పాలై లేవలేని స్ధితికి చేరింది.వైద్యం కోసం, బుస్సురాయి నుండి పది కిలోమీటర్లు డోలిలో మోస్తూ, మామిడి గూడెం తీసుకెళ్తున్న దృశ్యం ఇది. అక్కడి నుండి ఆంబులెన్స్‌ దొరికితే, కొత్త గూడెం ఆసుపత్రికి చేరుస్తారు.


వీరెందుకు జబ్బుపడుతుంటారు ?

దాదాపు 500 కుటుంబాల గిరిజనులు జీవిస్తున్న ఈ ప్రాంతంలో చేతిపంపులు, బావులు లేక పోవడంతో వాగులు వంకల్లోని, బురదనీరు తాగి రోగాల బారిన పడుతున్నారు. సమీపంలో ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు లేవు. అడవుల్లో ఎలక్కాయలు, బంక, చిల్లగింజలు, ఇప్పపువ్వు, తునికి, పాల, పరికిపండ్లు సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. సంక్షేమ పథకాలు వీరి ఆవాసాల వైపు చూడవు.


గుట్టలు,పుట్టల మధ్య బతుకుతున్న వీరికి, కనీస అవసరాలైన విద్య, వైద్యం, విద్యుత్‌, తాగునీరు, రోడ్లు, ఇళ్లు, పాఠశాలలను ఏర్పాటు చేస్తే,వారి జీవితాలు మెరుగవుతాయి. ఎండాకాలంలో కాలువలు, కుంటలు ఎండిపోవడంతో నీరు దొరకక ఇటు వానా కాలంలో వచ్చే బురదనీరు తాగలేక ప్రాణాలు నిలబెట్టుకోవడానికి జీవన సమరం చేస్తున్నారు.

సర్కారు కదిలింది కానీ.

గత మే నెలలో, జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం,గిరిజన ప్రాంతాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులను వేధిస్తున్న పౌష్టికాహార లోపం, రక్తహీనత తదితర అనారోగ్య సమస్యలపై ప్రత్యేక డ్రైవ్‌ చేయించారు. మారుమూల అటవీ గ్రామాల్లో పర్యటించి వైద్య పరీక్షలు నిర్వహించి, రక్తహీనత, పౌష్టికాహార లోపం ఇతర అనారోగ్య సమస్యలను గుర్తించారు కానీ తదుపరి చర్యలు ఏం తీసుకున్నారో సమా చారం లేదు.


ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా రక్త పరీక్షలు నిర్వహించినపుడు, వారిలో 95 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు తేలింది. దాదాపుగా అందరికీ చాలినంత రక్తం లేదు. వయసు ఆధారంగా చూస్తే పిల్లల్లో చాలా మంది సరైన బరువు కూడా లేరు. ఇప్పటి వరకు సుమారు 310 మంది చిన్నారులను పరీక్షించారు. వీరిలో 92 శాతం మంది తక్కువ బరువు కలిగిన వారే కావడం గమనార్హం.

వీరిలో 50 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పిల్లల్లో పొట్టవాపు వ్యాధిలో బాధపడుతున్న 40 మంది వరకు ఉన్నారని పరీక్షల్లో తేలింది.

ఈ నేపథ్యంలో కొన్ని తండాలకు సైకిల్‌ ఆంబులెన్సులు, కమ్యూనిటీ హాళ్లు మంజారు చేసినట్టు అధికారులు చెప్పారు. అవి ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది. ( photos -Narender)

మరింత సమాచారం తెలుసుకోండి: