సాధారణంగా గుడ్లు అందరికి అందుబాటులో ఉండేవి. ఈ ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. ఆరోగ్యమైన జీవితంలో గుడ్డును ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఉడికించిన గుడ్డును ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఊబకాయం నుండి దూరంగా ఉండొచ్చు అని ఒక పరిశోధన చెబుతుంది. అయితే చాలా మందికి గుడ్డు తింటే కొవ్వు పెరుగుతుందని అనుకుంటారు. దీంతో గుడ్డు తినడం మానేస్తారు. కానీ అది అపోహ మాత్రమే..
వాస్తవానికి గుడ్డులోని తెల్లసొనలో ఆల్బుమిన్, బోలెడన్ని మాంసకృత్తులు ఉంటాయి. దాంట్లో కొలెస్ట్రాలేమీ ఉండదు. పచ్చసొనలోనే కొలెస్ట్రాల్ ఉంటుందిగానీ అదొక్కటే కాదు, అందులో విటమిన్-ఎ, ఇతర కొవ్వు ఆమ్లాల వంటివెన్నో ఉంటాయి. కాబట్టి అందరికీ గుడ్డు మంచిది. కాకపోతే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉన్నవాళ్లకు, గుండె జబ్బులు, హైబీపీ వంటివి ఉన్నవారికి ఈ పచ్చసొనతో కొంత ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి వాళ్లు పచ్చసొన తీసేసి ఒక్క తెల్లదాన్ని తినొచ్చు.
అయితే ఏ సమస్యా లేని సాధారణ ఆరోగ్యవంతులు గుడ్డు నిశ్చింతగా తినొచ్చు.. రోజుకు ఒకటి తింటే మేలే చేస్తుంది. గుడ్డుని తినడం వల్ల కండరాలు దృఢంగా అవుతాయి. గర్భవతులకు గుడ్డు చాలా ఆరోగ్యకరం. గుడ్డులో ఉండే ఫోలిక్ యాసిడ్, ఇనుము పుట్టబొయే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. రోజుకి ఒక గుడ్డును ఆహారంలో తీసుకుంటే శరీరానికి మేలు చేసే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.