శీతాకాలం వ‌చ్చేస్తోంది. ఈ సీజ‌న్‌లో చలి ఎక్కువగా ఉంటుంది.  రకరకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలూ ఈ సీజన్‌లోనే వస్తుంటాయి. ముఖ్యంగా గర్భిణులు, పిల్లలు చలికాలంలో రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇతర కాలాలతో పోల్చితే గర్భిణులు చలికాలంలో ఎక్కువగా  అనారోగ్యాల పాలవుతుంటారు. ఈ కాలంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించకపోతే తల్లితో బాటు బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే ఉదయాన్నే లేచి వాకింగ్‌, జాగింగ్‌ వంటివి చేయడం నిత్యకృత్యమైనా చలికాలంలో చేయడం మరొక ఎత్తు.


గర్భిణులు ఈ కాలంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేసవితో పోల్చితే చలికాలంలో మంచినీరు తాగటం తక్కువ గనుక గర్భిణులు సులభంగా డీహైడ్రేషన్‌ బారిన పడతారు. శరీరం ఫ్లూయిడ్స్‌ను కోల్పోయే కొద్దీ బిడ్డకూ పోషకాలు అందటం తగ్గుతుంది. అందుకే దాహం అనిపించే వరకు ఆగకుండా ప్రతి గంటకూ కాసినైనా నీళ్లు తాగాలి. చలికాలంలో గర్భిణులు చిరుతిండిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రోజూ గుప్పెడు వేయించిన శెనగలు, వేరుశెనగ, బఠాణీ, డ్రై ఫ్రూట్స్ వంటివి తినటం వల్ల పోషకాహార లోపాలు నివారించబడతాయి.


గర్భిణులు రోజూ వాకింగ్, ప్రాణాయామం వంటి వ్యాయామాలను నిపుణులు సూచించిన రీతిగా సాధన చేయాలి. ఈ సీజన్లో జలుబు మొదలు ఇన్ఫెక్షన్లు, స్వైన్ ఫ్లూ వంటి వైరస్ల ముప్పు ఎక్కువ. ఈ పరిస్థితిని నివారించేందుకు గర్భిణులు వ్యక్తిగత శుభ్రత మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. కాచి చల్లార్చిన నీటిని, వేడి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మంచుపట్టిన సమయంలో బయట తిరగడం మంచిదికాదు. అలర్జీలు వ్యాప్తిచెందే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: