గత కొన్ని సంవత్సరాల నుండి కిడ్నీల వ్యాధితో బాధ పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 8 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కిడ్నీల వ్యాధితో బాధ పడే వారి సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. మరి కిడ్నీల వైఫల్యానికి కారణాలేమిటి? అని ముగ్గురు వైద్యులు చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. ఈ పరిశోధనలో దీర్ఘకాలంగా బోరు నీళ్లు తాగుతున్నా, మండుటెండల్లో ఎక్కువగా పని చేస్తున్నా కిడ్నీలకు ప్రమాదమేనని తెలిసింది. 
 
శరీరానికి తగినంత నీరు తాగకపోయినా, ఒళ్లునొప్పులకు మాత్రలు ఎక్కువగా వాడుతున్నా కూడా కిడ్నీలకు సంబంధించిన సమస్యలు వస్తాయని తెలిసింది. 50 సంవత్సరాలలోపు వారు 60 శాతం, 40 సంవత్సరాలలోపు వారు 35 శాతం కిడ్నీలకు సంబంధించిన ఏదో ఒక సమస్యతో బాధ పడుతున్నారని పరిశోధనలో తెలిసింది. తమిళనాడు, కేరళ, తెలంగాణకు చెందిన ముగ్గురు వైద్యులు ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్నారు. 
 
12 సంవత్సరాల నుండి వీరు వేరు వేరు ప్రాంతాలలో చేసిన అధ్యయనం ద్వారా ఈ విషయాల గురించి వెల్లడించారు. భూగర్భ జలాల్లో ఉండే ప్రమాదకర ఖనిజాలు సీసం, సిలికా, స్ట్రాన్షియం ఈ వాధికి ప్రధానంగా కారణమవుతున్నాయి. కిడ్నీ వ్యాధి బాధితుల్లో ఎక్కువ మంది చాలా సంవత్సరాలుగా బోరు నీటిని తాగుతున్నవారే కావటం గమనార్హం. ఎండల్లో పని చేసేవారికి వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావటం వలన కిడ్నీ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 
 
వైద్యులు మాట్లాడుతూ ఎక్కువగా నిత్యం ఎండలో పని చేసే వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కూలీలు, హమాలీలు మరియు పోషకాహార లోపంతో బాధ పడేవారు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని ఊచపల్లి, శ్రీకాకుళం జిల్లా సోంపేట, ఇచ్చాపురం, కవిటి ఒంగోలు జిల్లాలో కనిగిరి, చీమకుర్తి మండలాల్లో కిడ్నీ వ్యాధి  బాధితులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలో ఎక్కువమంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: