రాగులు తృణ ధాన్యాల్లో చాలా బలవర్థకమైన ఆహారం. దక్షిణ భారతదేశంలోని కొన్ని గ్రామాల్లో వీటిని ప్రధాన ఆహారంగా కూడా తీసుకుంటారు. వీటిల్లో క్యాల్షియం దండిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. కాసిని నీళ్లూ, రెండు చెంచాల రాగి పిండి, ఓ బెల్లం ముక్క.. ఈ మూడింటితో తయారయ్యే రాగిజావ నిజంగా ఆరోగ్య ప్రదాయినే.  దీన్ని రోజుకోసారి తీసుకోవడం వల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.


రాగిలో పీచుపదార్థాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారు రోజూ రాగి జావ‌ తీసుకుంటే మంచిది.  రాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది.  రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి. అంతేకాదు కండరాల ఆరోగ్యానికీ, రక్తం తయారవడానికీ, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి.


రాగి పిండిలో విటమిన్‌-సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం ఒక్కటే కాదు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఐసోల్యూసిన్‌ అమైనో ఆమ్లం కండరాల మరమ్మతుకు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తుంది. రాగి జావ‌ క్రమం తప్పకుండా తింటే పోషకాహార లోపాన్ని నివారించవచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: