రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉంది...  ముఖ్యంగా హైదరాబాద్‌లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా బాధితులతో ఆస్పత్రులు కిలకిటలాడుతున్నాయి..  దీంతో  వ్యాధి వ్యాప్తిపై  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  డెంగ్యూ నివారణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.   డెంగీ వ్యాప్తిపై కరుణ అనే డాక్టర్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు, డెంగ్యూ నివారణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ డాక్టర్ కరుణ కొన్ని వారాల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. 


  కొన్ని వేలాది విద్యార్థులు డెంగీతో బాధపడుతుండగా... ఓవైపు మృతిచెందిన వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు.    ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని..డెంగీ నిర్మూలనకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. 
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని.. నివారణ చర్యలు ఎందుకు చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేసింది.  దీనిపై నేరుగా హైకోర్టుకే వచ్చి సమాధానం చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్యశాఖ, మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్లను ఆదేశాలు జారీ చేసింది. 


డెంగ్యూతో ఎంత మంది మృతిచెందారు..? డెంగ్యూ నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు..?  దోమల నివారణ విషయంలో ఏం చేశారనే అనే దానిపై కోర్టు ఎదుట సమాధానం చెప్పాల్సి ఉంటుంది.  ప్రభుత్వం తరఫున కోర్టు ముందు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హజరు కాగా.. ఏసీ రూముల్లో కూర్చొని తమాషా చేస్తున్నారా అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 3,800 డెంగీ కేసులు నమోదైతే ప్రభుత్వం తక్కువ కేసులు చూపెడుతోందని ఫైర్ అయ్యారు.డెంగీ నివారణకు చర్యలు తీసుకున్నామని సీఎస్ ఎస్కే జోషి కోర్టుకు చెప్పగా.. నివారణ చర్యలు తీసుకుంటే వ్యాధి కేసులు ఎందుకు నమోదవుతున్నాయని ప్రశ్నించింది.


సీఎస్ వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. డెంగీ మరణాలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఒక సారి మూసీనదిని పరిశీలించాలని అధికారులను ఆదేశించింది.రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా నది మధ్యలోనే ఉన్నాయని, అక్కడ లేని డెంగ్యూ మరణాలు ఇక్కడే ఎందుకు ఉన్నాయని, మూసీని ఆనుకొని ఉన్న హైకోర్టులోనూ దోమలు ఉన్నాయని స్పష్టం చేసింది. డెంగీ వ్యాధిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: