డెంగ్యూ జ్వరం బారిన పడి వందల సంఖ్యలో రోగులు ఆస్పత్రులలో చేరి చనిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ జ్వరం బారిన పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన విషయం తెలిసిందే. డెంగ్యూ జ్వరం వస్తే ప్లేట్ లెట్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ప్లేట్లెట్ల సంఖ్య ఎక్కువగా తగ్గితే ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన డెంగ్యూ జ్వరం రాకుండా జాగ్రత్తపడవచ్చు. డెంగ్యూను నివారించటానికి ఎలాంటి టీకాలు లేవు. 
 
దోమలు కుట్టకుండా చేతులు, కాళ్లను నిద్రించే సమయంలో పూర్తిగా కప్పుకోవాలి. ఆల్ ఔట్ ఇతర మస్కిటో కాయిల్స్ ను ఉపయోగించాలి. కొబ్బరినూనె, వేపనూనె కలిపి శరీరానికి పూసుకుంటే దోమలు కుట్టవు. దోమలను పూర్తిగా నియంత్రించగలిగితే చికున్ గున్యా, మలేరియా, డెంగ్యూ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. తలుపులు, కిటికీలను సాయంత్రం సమయంలో మూసి ఉంచటం మంచిది. 
 
కాచి వడబోసిన నీళ్లు లేదా ఫిల్టర్ నీళ్లు మాత్రమే ఎల్లప్పుడూ తాగాలి. ప్లాస్టిక్ గ్లాసులు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలలో నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని నిల్వ చేస్తే మూతలు వాటిపై సరిగ్గా ఉంచాలి. మున్సిపల్ అధికారులను సంప్రదించి ఫాగింగ్ చేయించటం ద్వారా దోమలను నియంత్రించవచ్చు. 
 
ఇంటి మూలల్ని నిర్లక్ష్యం చేయకుండా ఎల్లప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. వీలైనంత వరకు బయట ఆహారం తినకపోవడమే మంచిది. అపరిశుభ్రమైన వాతావరణంలో తయారైన ఆహారం వలన కూడా వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దోమలు ఇంట్లో తిరుగుతున్నట్లు అనిపిస్తే దోమతెరలను అమర్చుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: