చైనాలో రోజురోజుకు విజృంభించిన ప్రాణాంతక కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండడంతో ప్రభుత్వాలు ఎక్కడికక్కడ అలర్ట్‌ అవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాకపోయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. ఇదే విషయంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వైద్య, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు.

 

 

ఈ కాన్ఫరెన్స్‌లో రాజేందర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న పల్మోనాలజిస్ట్‌లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా వైరస్ అనుమానితులు వస్తే చికిత్స చేయడం కోసం అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. సోమవారం నుంచి హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజ్‌లో కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఆస్పత్రిలో ప్రతి రోజు 30 మందని పరీక్షించే అవకాశం ఉందన్నారు. ఒక్కో పరీక్షకు సుమారు 10 గంటల సమయం పడుతుందని చెప్పారు. అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా పాజిటివ్‌గా నమోదు కాలేదని తెలిపారు. 

 


అదే విధంగా చైనా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. ఆస్పత్రుల్లో చేరిన అనుమానితులకు చికిత్స అందించేందుకు అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా మాస్కులు, శానిటైజర్లతో పాటు, పరీక్షలు చేసేందుకు సరిపోయేంత మందిని సిద్ధం చేశామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను రాష్ట్రంలో కూడా అమలుచేస్తున్నామని తెలిపారు. ఎంతటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ప్రజలు భయపడొద్దని మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: