రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ పంచాయతీ శాంతివనంలో రామచంద్ర మిషన్‌ నిర్వహిస్తున్న 75వ వసంతోత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం హాజరయ్యారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కోవింద్‌ కుటుంబ సమేతంగా శనివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఎంపీ సంతోష్‌కుమార్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం ఆయనను శాలువాతో సత్కరించారు. 

 

అక్కడి నుంచి రాష్ట్రపతి.. రాజ్‌భవన్‌కు చేరుకొని బస చేశారు. ఆదివారం ఉదయం  ప్రఖ్యాత శ్రీరామచంద్ర మిషన్(ఎస్ఆర్సీఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారులో నిర్మితమైన ధ్యానకేంద్రాన్ని రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్  అధికారికంగా ప్రారంభించారు.  రామచంద్ర మిషన్ 75వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు ఎంతో గొప్పవని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కన్హా శాంతివనంలోని లక్ష మొక్కలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని, ఇదొక పవిత్ర స్థలం అనే భావన కలిగిందని చెప్పారు. 150కిపైగా దేశాల్లో రామచంద్ర మిషన్ సేవలందిస్తుండటం, ధ్యానం ద్వారా ఆథ్యాత్మిక పురోగతి, ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతుండటం గొప్పవిషయమన్నారు.

 

ఉత్సవాల్లో భాగంగా శాంతివనం వద్ద ప్రారంభమైన రెండో విడత ధ్యాన శిబిరం వేలాది అభ్యాసకులతో నిండిపోయింది. ఈ సందర్భంగా గురూజీ కమలేష్‌ పటేల్‌ ప్రసంగిస్తూ.. ధ్యానంతోనే ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఎంతో మార్పు వస్తుందన్నారు. అదేవిధంగా ‘శిబిరానికి వచ్చేవారికి మిషన్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. 40,000 మందికి వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తోందరెండో విడత శిబిరం ఈ నెల 3తో ముగుస్తుంది. మూడోది 7న మొదలై 9 వరకు కొనసాగుతుంది’.  

మరింత సమాచారం తెలుసుకోండి: